న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026
పాల సేకరణ తక్కువ.. అమ్మకాలు ఎక్కువ
● డబ్బా పాల నాణ్యతపై అనుమానాలు
● అధికారుల పర్యవేక్షణపై తలెత్తుతున్న ప్రశ్నలు
● శాంపిళ్ల ఫలితాల వెల్లడిపై ఎదురుచూపులు
జనగామ: జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో లూజు పాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక అడ్డాలు ఏర్పాటు చేసుకుని ఉదయం, సాయంత్రం పాలు విక్రయిస్తున్నా, వాటి సేకరణ, నాణ్యత, విక్రయదారుల అనుమతులపై సమగ్ర పర్యవేక్షణ ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జిల్లాలో 2లక్షల లీటర్ల సేకరణ
జిల్లాలో సుమారు 1.50 లక్షల గోజాతి, గేదెజాతి పశువులు ఉన్నట్లు సమాచారం. ఇందులో పాలిచ్చే గోజాతి పశువులు 20,493, గేదెజాతి పశువులు 26,537 ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు 2లక్షల లీటర్ల వరకు పాల సేకరణ అవుతున్నట్లు అంచనా. ఇందులో 30 వేల లీటర్లకు పైగా విజయ డెయిరీకి వెళ్తున్నాయి. ప్రైవేట్ డెయిరీలకు 75వేల లీటర్లకు పైగా చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలు స్థానికంగా లూజు పాలు విక్రయించకుండా టెట్రా ప్యాక్ తదితర ప్యాకేజింగ్ కోసం ప్రధాన డెయిరీలకు తరలిస్తుంటారు. దీంతో పాటు 50వేల పాడి పరిశ్రమ కుటుంబాలు.. వారి అవసరాలకు అదనంగా ఒక్కో లీటరు వాడుకోవడం, 15వేల లీటర్లకు పైగా పన్నీరు తయారీకి ఉపయోగించగా మిగిలిన సుమారు 30వేల పైచిలుకు లీటర్ల పాలు జిల్లాలో మిగులుతాయనేది అంచనా.
అవసరానికి..సేకరణకు పొంతనేదీ?
జిల్లాలో సుమారు 1.95 లక్షల కుటుంబాలు, 5.80 లక్షల జనాభా ఉన్నట్లు అంచనా. ఒక్కొక్కరికి రోజు కు 300 గ్రాముల లీటర్ల పాలు అవసరమని తీసుకుంటే సుమారు 1.74 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయి. కానీ జిల్లాలో నమోదయ్యే సేకరణ సుమారు 2లక్షల లీటర్లే. ఇందులో 1.70లక్షల లీటర్ల పాలు డెయిరీలు, పన్నీరు, తదితర వాటికి వెళ్తుండగా, మిగిలిన పరిమాణం ఎంత, పట్టణాలు, గ్రామాల్లో లూజుగా విక్రయించే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది తేలాల్సి ఉంది. ఇందులో సుమారు 40వేల లీటర్లకు పైగా పాల ప్యాకెట్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా.
పట్టణంలో ప్రత్యేక ప్రైవేటు అడ్డాలు
పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తా, గణేష్ స్ట్రీట్, కురుమవాడ, బాలాజీనగర్, నెహ్రూ పార్కు తదితర ప్రాంతాల్లో తాత్కాలిక ప్రైవేట్ అడ్డాలు ఏర్పాటు చేసుకుని రోజుకు సుమారు 2వేల లీటర్ల వరకు లూజు పాలు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు గ్రామాల నుంచి వచ్చేవారు డబ్బాల్లో ఇంటింటికీ పాలు సరఫరా చేస్తున్నారని, ఈ విధంగా రోజుకు సుమారు 20 వేల లీటర్ల వరకు విక్రయాలు జరుగుతున్నట్లు స్థానిక అంచనా వేస్తున్నారు.
శాంపిళ్ల సేకరణ
రెండు వారాల క్రితం మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వినీల్ ఆధ్వర్యంలో లూజు పాల విక్రయాలపై తనిఖీలు నిర్వహించి శాంపిళ్లు సేకరించారు. అయితే వాటి పరీక్షల్లో ఏం తేలిందన్న విషయం వెల్లడికావాల్సి ఉంది. ఒక్కరోజు తని ఖీలకే పరిమితం కాకుండా నిరంతర తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పాలలో యూరి యా, ఇతర పదార్థాలు కలుపుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ రోపణలను నిజమని తేల్చకుండా శాసీ్త్రయ పరీక్షల ద్వారా వాస్తవాలను అధికారులు బహిర్గతం చేయాల్సిన అవసరముంది.
పాల నాణ్యత తెలియడం లేదు..
ప్రతీరోజు మా ఇంటికి పాల ప్యాకెట్లను వాడుతున్నాం. రోజుకు ఒక లీటర్ పాలను వాడుతాం. తప్పనిసరి పరిస్థితిలో ప్యాకెట్లను వినియోగిస్తున్నాం. అయితే ఇందులో నాణ్యత ఎంత మేరకు ఉందో మాకు తెలియడం లేదు. పాల ప్యాకెట్ల సరఫరా, నాణ్యతపై అధికారులు తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
–వంచ చంద్రశేఖర్‌రెడ్డి, పీడీ, స్టేషన్‌ఘన్‌పూర్
ధ్రువీకరణ తప్పనిసరి
ప్రతీరోజు స్టేషన్‌ఘన్‌పూర్‌లో అర లీటర్ లూజు పాలను కొనుగోలు చేస్తాం. లీటర్‌కు రూ.80 తీసుకుంటున్నారు. అయితే వారు విక్రయించే పాలు నాణ్యమైనవా లేదా అనేది ధ్రువీకరణ లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న మిల్క్ సెంటర్లలో పాలను కొనుగోలు చేస్తున్నాం. మిల్క్ సెంటర్ల అధికారుల పర్యవేక్షణ అవసరం.
–కె.శరత్ కుమార్, స్టేషన్‌ఘన్‌పూర్
నిబంధనలు ఏమిటి?
ప్రత్యేక అడ్డాలు ఏర్పాటు చేసి లూజు పాలు విక్రయించేవారు ఆహార భద్రతా నిబంధనలను పాటిస్తున్నారా? ఫుడ్ సేఫ్టీ రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ ఉందా, పాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, ప్రతిరోజూ ఎన్ని లీటర్లు విక్రయిస్తున్నారు.. రవాణా, నిల్వ, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా అన్న అంశాలపై అధికారులు పరిశీలించాలి. ముఖ్యంగా జిల్లాలోని పాల ఉత్పత్తి, డెయిరీలకు వెళ్లే పరిమాణం, లూజు పాల విక్రయాల పరిమాణంపై శాసీ్త్రయంగా లెక్కలు తీస్తే అసలు పరిస్థితి స్పష్టమయ్యే అవకాశం ఉంది.


