జనగామ | - | Sakshi
Sakshi News home page

జనగామ

Aug 1 2026 1:31 AM | Updated on Aug 1 2026 1:31 AM

ఉద్యమ పెద్దన్నకు ఊరూవాడా కన్నీటి వీడ్కోలు

శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ఉద్యమ పెద్దన్నకు ఊరూవాడా కన్నీటి వీడ్కోలు

నర్సంపేటలోని అమరవీరుల స్తూపం జంక్షన్‌ వద్ద పెద్ది సుదర్శన్‌రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న అశేష జనవాహిని

7

నర్సంపేట/దుగ్గొండి/నల్లబెల్లి : తెలంగాణ ఉద్యమకారుడి ఊపిరి ఆగిందని తెలిసి వేలాది గుండెలు తల్లడిల్లాయి. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్థివదేహం తమ గ్రామం మీదుగా వస్తుందని తెలిసి వివిధ గ్రామాల నుంచి రాజకీయాలకు అతీతంగా ఆయన అభిమానులు ఇళ్లకు తాళాలు వేసి కుటుంబాలతో తరలివచ్చారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తమ కుటుంబ పెద్దను కోల్పోయామని ఆర్థనా దాలు చేశారు. ఉద్యమకారులు తమ సహచరుడిని కోల్పోయామని విలపించారు. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ల పాటు సాగిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రునివాళులు అర్పించారు.. ‘మల్లెప్పుడొస్తవ్‌ పెద్దన్నా’ అంటూ మహిళలు రోదించిన తీరు కంట తడి పెట్టించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాతోపాటు రాష్ట్రంలో ఉద్యమనేతగా గుర్తింపు పొందిన గులాబీ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి(54)కి శుక్రవారం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. హనుమకొండలోని తన స్వగృహంలో గత ఆదివారం ఉదయం గుండెపోటుతో అస్వస్థతకు గురైన ఆయనకు వెంటనే రోహిణి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి గురువారం అర్ధరాత్రి దాటాక తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని అంబులెన్స్‌లో భారీ కాన్వాయ్‌తో హనుమకొండకు తీసుకురాగా, అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం వరంగల్‌ మీదుగా గిర్నిబావికి చేరుకుంది. అక్కడ ఆయన పార్థివదేహాన్ని అంబులెన్స్‌ నుంచి ప్రత్యేక రఽథంపై ఉంచి అంతిమయాత్ర ప్రారంభించారు. గిర్నిబావి ప్రధాన రహదారిపై రెండు కిలోమీటర్ల మేర జనసంద్రమైంది. కార్యకర్తలు దారి పొడవునా పుష్పాంజలి ఘటిస్తూ జోహార్‌ పెద్దన్నా అంటూ నినదించారు. లక్నెపల్లి, మహేశ్వరం మీదుగా అంతిమయాత్ర మధ్యాహ్నం ఒంటి గంటకు నర్సంపేటకు చేరుకుంది. పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం నుంచి స్డేడియం వరకు దాదాపు మూడు గంటల పాటు అంతిమయాత్ర కొనసాగింది. నర్సంపేటలో స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు బంద్‌ పాటించాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి బంద్‌ పాటించారు.

తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ నాయకత్వం..

పెద్ది అంత్యక్రియలకు బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం అంతా తరలివచ్చింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్‌, మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, అరూరి రమేశ్‌, డాక్టర్‌ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్‌, రెడ్యానాయక్‌, ఒడితల సతీశ్‌, బాల్క సుమన్‌, మాజీ మేయర్‌ గుండు సుధారాణి, మాజీ జెడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. అలాగే రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, తదితరులు నివాళులర్పించారు.

నల్లబెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో

అంతిమ సంస్కారాలు..

సాయంత్రం 6.30 గంటల మధ్యలో నల్లబెల్లికి చేరుకున్న సమయంలో గంటపాటు జోరు వాన కురిసింది. పెద్ది భౌతికకాయంపై కేటీఆర్‌, హరీశ్‌రావు, మాజీ మంత్రులు కలిసి బీఆర్‌ఎస్‌ జెండా కప్పారు. కేటీఆర్‌, హరీశ్‌రావు చేతులు పట్టుకుని స్వప్న బోరున విలపించారు. నేతలు కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని విలపించడంతో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. రాత్రి 9 గంటల తర్వాత నల్లబెల్లిలోని నివాసంనుంచి ప్రారంభమైన అంతిమయాత్ర మండల కేంద్రంలోని వీధులగుండా సాగింది. ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యవసాయ క్షేత్రం వరకు వేలాదిమంది మధ్య ఊరేగింపుగా పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దయాకర్‌రావు, పాడికౌశిక్‌రెడ్డి పాడె మోశారు. ఓవైపు జోరు వాన కురుస్తున్నా వేలాది మంది అభిమానుల మధ్య రాత్రి 10 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

అంతిమయాత్ర సాగిందిలా...

– వరంగల్‌ డెస్క్‌

సుదర్శన్‌రెడ్డి పాడె మోస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి

ప్రభుత్వ లాంఛనాలతో..

అభిమానులు అశ్రునయనాల నడుమ ప్రభుత్వ అధికార లాంఛనాలతో పెద్ది అంత్యక్రియలు నిర్వహించారు. నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఏసీపీ రవిందర్‌ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన చితికి కుమారుడు నిదర్శన్‌ రెడ్డి నిప్పంటించారు. పోలీసుల గౌరవ వందన సమయంలోనూ ‘పెద్ది జిందాబాద్‌’ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.

సుదర్శన్‌రెడ్డి పార్థివదేహం హనుమకొండ, గిర్నిబావి, నర్సంపేట మీదుగా నల్లబెల్లికి తరలింపు

ఊరూరా రోడ్ల వెంట వేచి ఉన్న ప్రజలు, అభిమానులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు

నర్సంపేట, నల్లబెల్లిలో స్వచ్ఛందంగా బంద్‌ పాటించిన వ్యాపార, వాణిజ్య సంస్థలు

కేటీఆర్‌, హరీశ్‌రావుతోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకుల నివాళి

మంత్రి సీతక్క, మంద కృష్ణ, గోరటి వెంకన్న, పలువురు ఎమ్మెల్యేల పుష్పాంజలి

అంతిమయాత్రలో పెద్ది స్వప్న ఆగ్రహం

పెద్ది అంతిమయాత్ర నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకోగా.. పెద్దికి వ్యతిరేకంగా గత మున్సిపాలిటీ ఎన్నికల్లో టెంట్‌ వేసిన బోర్‌ వెల్‌ షాపు యజమానుల వైపు చూస్తూ మీరు చేసిన మనోవేదన వల్లే తన భర్త చనిపోయాడని దూషిస్తూ స్వప్న ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో పెద్దికి వ్యతిరేకంగా బోర్‌ వెల్‌ షాపు యజమానులు టెంట్‌ వేసి నిరసన దీక్షకు కూర్చున్న ఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

‘పెద్ది’ లేక.. పొద్దు పొడవక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement