జనగామ రూరల్: ఎల్‌నినో ప్రభావంతో మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేయగా రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా లబ్ధిదారులకు పంపిణీకి సిద్ధం చేశారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ (మూడు) నెలలకు సంబంధించిన సన్న బియ్యం నేటి (ఆగస్టు నెల) నుంచి ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఒక్కొక్కరికి 18 కేజీల చొప్పున
జిల్లాలో ఉన్న 335 రేషన్ దుకాణాల ద్వారా తెల్ల కార్డుదారులకు మూడు నెలలకు సంబంధించి రేషన్ బియ్యం నేటి (శనివారం) నుంచి ఇవ్వనున్నారు. జిల్లా పరిధిలో ఉన్న రేషన్ దుకాణాలకు బియ్యం స్టాక్ పంపినట్లు దశల వారీగా స్టాక్ వివరాలు తెలుసుకోని పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 18 కేజీల సన్నబియ్యం అందజేయనున్నారు. అంత్యోదయ కార్డు వారికి 35 కిలోలు ఇవ్వనున్నారు.
డీలర్లకు తప్పని ఇబ్బందులు
ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం కోటా ఒకే సారి విడుదల చేస్తుండటంతో తమకు శ్రమ అధికమవు తుందని ఇబ్బందులు తప్పవని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. చిన్నగా ఉన్న రేషన్ దుకాణాల్లో నిల్వ సామర్థ్యం లేకపోవడం, మూడు నెలల కోటా పట్టకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయి. అలాగే ఒక్కో వినియోగదారుడికి కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వినియోదారులకు జూలై నెలకు సంబంధించి రేషన్ బియ్యం పంపిణీ పూర్తయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు నుంచి మూడు నెలల కోటా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా పరిధిలోని రేషన్ దుకాణాలకు బియ్యం స్టాక్ తరలిస్తున్నాం. విడతల వారీగా కోటా భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. వినియోగదారులు సహకరించాలి.
– సురేష్‌రెడ్డి, డీసీఎస్‌ఓ
మొత్తం కార్డులు 1,87,756
సన్నబియ్యం పంపిణీకి సర్వం సిద్ధం
జిల్లాలో 335 షాపులు
1,87,736 రేషన్ కార్డులు


