జనగామ: పట్టణంలోని 21వ వార్డు పరిధిలోని కురుమవాడలో ఆదివారం జరిగిన ప్రహరీ కూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. డీసీపీ కార్యాలయం వెనుక భాగంలో నూతన భవన నిర్మాణ పనులు జరుగుతుండగా, నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రహరీకి ఆనుకొని ఇసుక డంప్ చేశారు. అనంతరం పొక్లెయినర్‌తో ఇసుకను తొలగించే సమయంలో గోడపై అధిక ఒత్తిడి పడడంతో సిమెంట్, ఇటుకలతో నిర్మించిన ప్రహరీ ఒక్కసారిగా కురుమవాడ గల్లీ వైపు కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ పార్క్ చేసిన రెండు కార్లు పూర్తిగా దెబ్బతినగా, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక సైకిల్ కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే తీవ్ర ప్రాణనష్టం సంభవించే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రహరీ కొంతకాలంగా ప్రమాదకర స్థితిలోనే ఉందని, దీనిపై పలుమార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ఇసుకను గోడకు డంప్ చేసి జేసీబీతో నిర్లక్ష్యంగా పనులు చేయడమే ప్రమాదానికి కారణమని మండిపడ్డారు. ప్రమాద ఘటన అనంతరం స్థానిక కౌన్సిలర్ మామిడాల రజితరాజుతో కలిసి కాలనీవాసులు డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ను కలిసి జరిగిన ప్రమాదంపై ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నష్టపోయిన వాహనాల యజమానులకు తగిన నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.
నిర్మాణపనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
రెండు కార్లు, మూడు ద్విచక్ర
వాహనాలు ధ్వంసం


