కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని డెంటల్ (దంత వైద్య) విభాగం నామమాత్రంగా నడుస్తోంది. ఇందులో ఒకే వైద్యురాలు అరకొర వసతుల మధ్య వైద్య సేవలు అందిస్తున్నారు. క్లినికల్ వైపు నుంచి ఓ డెంటల్ హైజినిస్టు ఓపీ పేషంట్లకు వైద్య చికిత్స చేస్తున్నారు. అయితే, వైద్య నిపుణుల కొరతతో రోగులకు సరైన సేవలు అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆరోగ్యశ్రీ కింద ఇద్దరు వైద్యులుండగా వీరిని తొలగించి ఇంటర్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్యూలకు నలుగురు వైద్యులు హాజరు కాగా.. ఇద్దరు వైద్యులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏడాది దాటినా కూడా ఆ ఇద్దరు వైద్యుల నియామకం ఎంతవరకు వచ్చిందో తెలియదు. అలాగే, మరో గవర్నమెంట్ ఔట్‌సోర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను సైతం టర్మినేషన్ చేశారు. ముఖ్యంగా డెంటల్ డిపార్ట్‌మెంట్‌కు హెచ్‌ఓడీగా ఉన్న ప్రొఫెసర్ సైతం నర్సంపేటకు బదిలీ అయ్యారు. దీంతో ఈ విభాగం నుంచి నలుగురు వెళ్లినా ఏ ఒక్కరు కూడా రాకపోవడంతో ఇద్దరిపై భారం పడుతోంది.
● ఎంజీఎం ఆస్పత్రిలో పరికరాలు ఉన్నా వేధిస్తున్న సిబ్బంది కొరత
● రోగులకు అరకొరగా వైద్యసేవలు


