
రాష్ట్ర అధ్యక్షులుగా బీసీలనే నియమించాలి
● బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధయ్య
జనగామ రూరల్: బీఆర్‌ఎస్, భారతీ య జనతా పార్టీలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా బీసీలనే నియమించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధయ్య డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో పట్టణ అధ్యక్షుడు జాయ మల్లేష్ ఆధ్వర్యాన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ప్రజలకు ఆ రెండు పార్టీలు చేసిన అభివృద్ధి ఏమి లేదని, రాజ్యాధికారం రాకుండా నిలువరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారని, గతంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని, పొరపాట్లను, నష్టాలను, తప్పుడు పాలసీలను ప్రజలకు తెలియ జేయాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందన్నారు. దేశ జనాభాలో 56శాతం ఉన్న బీసీలను నిర్లక్ష్యం చేస్తూ రిజర్వేషన్లలో అన్యాయం చేసి అధికారంలోకి రాకుండా అడ్డుకున్న బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నామాల శ్రీనివాస్, రజక చైతన్య సంఘం జిల్లా నాయకుడు ఎదునూరి రవీందర్, కొలిపాక రాములు, కురుమ, యాదవ, కుమ్మరి, పద్మశాలి, బీసీ సంఘాల నాయకులు దేవర సత్యనారాయణ, చంద్ర శ్రీనివాస్, నాంపల్లి అశోక్, వల్లాల మల్లేశం, బత్తిని అశోక్ తదితరులు పాల్గొన్నారు.