
మెరుగైన చట్టం.. ‘భూ భారతి’
లింగాలఘణపురం/రఘునాథపల్లి: ఇప్పటి వరకు దేశంలో వచ్చిన చట్టాల్లో భూమి సమస్యల పరిష్కారంలో ఎంతో మెరుగైనది ‘భూ భారతి’ చట్టం.. రైతులు అవగాహనతో తమ భూముల సమస్యలు పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం లింగాలఘణపురం తహసీల్ కార్యాలయం వద్ద అలాగే రఘునాథపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహ న సదస్సుల్లో కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి ఆయ న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో తోక పాసుబుక్కులు, ఆర్‌ఓఆర్–1బీ పాసు బుక్కులు, ధరణి పాస్ బుక్కులు ఇలా అనేక చట్టాలు వచ్చినప్పటికీ వాటి కంటే భూ భార తి ఎంతో మెరుగైనదని అన్నారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 10 లక్షల సాదా బైనామాలు, 18 లక్షల పార్ట్ ‘బీ’ సమస్యలు పరిష్కరించుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ప్రతి గ్రామానికి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లను నియమించి సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ భూభారతి చట్టం అమలు మొదలైనప్పటి నుంచి ఏడాదిలోగా రైతులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని, మే 30 వరకు అన్ని జిల్లాల్లో, జూన్ 2న అన్ని రెవెన్యూ గ్రామాల్లో చట్టం అమలులోకి వస్తుందని వివరించారు. ఈ సందర్భంగా కళ్లెం గ్రామానికి చెందిన సిరిగిరి పోచయ్య తమ అసైన్డ్ భూమి సమస్య పరిష్కరించాలని అధికారులకు మొరపెట్టుకున్నా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, ఎస్‌డీసీ సుహసిని, ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్లు రవీందర్, మోసిన్‌ముజ్తబా, ఎంపీడీఓలు జలేందర్‌రెడ్డి, గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
అవగాహనతో సమస్యలు పరిష్కరించుకోండి
ఎమ్మెల్యే కడియం శ్రీహరి