పురపోరుకు కౌంట్‌డౌన్
నేడు వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల
జనగామ: రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగియడంతో, ప్రభుత్వం మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ఈనేపథ్యంలో ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీల ఓటరు జాబితా ప్రకటన విడుదల చేసింది. ఈనెల 1న (గురువారం) కొత్త సంవత్సరం తొలి రోజు వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల ముందుకు తీసుకురానున్నారు. అదే రోజు నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. జనవరి 5న రాజకీయ పార్టీ ప్రతినిధులు, 6న ఎన్నికల అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. 10న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకమే
ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ రెండు మున్సిపాలిటీల పరిధిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సుదీర్ఘ విరామం తర్వాత జరగనున్న మున్సిపాలిటీల ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. అభ్యర్థుల అంచనాల ప్రకారం రిజర్వేషన్ల లెక్కలు వేసుకుంటూ, వార్డుల వారీగా తమ బలం, బలహీనతలను పరిశీలిస్తుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష, ఇతర పార్టీలు సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని గెలుపు గుర్రాలను ఎంపిక చేసే ప్రక్రియలో నిమగ్నమయ్యాయి.
నేడు డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల
మున్సిపాలిటీలకు అసెంబ్లీ ఓటరు జాబితా ఆధారంగా బ్లాక్‌వైజ్ ఉన్న ఓటర్ల సమాచారాన్ని వార్డుల వారీగా విభజిస్తున్నారు. ఈ ప్రక్రియను జిల్లా హెడ్‌క్వార్టర్ మునిసిపల్‌లో రెండు పురపాలికలకు సంబంధించి బుధవారం వార్డుల వారీగా విభజన ప్రక్రియ చేపట్టారు. గురువారం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రజల ముందుంచనున్నారు. తుది జాబితా కోసం ఇంకో పదిరోజుల సమయం ఉండడంతో జనవరి మూడో వారంలో లేదా నాలుగో వారంలోనే పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సమాచారం. జనవరి చివరివారం లేదా ఫిబ్రవరి రెండోవారంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి ఎలక్షన్ కమిషన్ సన్నద్ధమవుతోంది.
రెండు మున్సిపాలిటీల్లో ఓటర్ల వివరాలు
జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో తాజా జనాభా, ఓటర్ల గణాంకాలను అధికారిక వర్గాలు వెల్లడించాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జనగామ మున్సిపాలిటీకి 30 వార్డులు ఉండగా, జనాభా 52,408గా నమోదైంది. ఇందులో 1,694మంది ఎస్టీ, 8,385 మంది ఎస్సీ వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నట్లు వివరాలు చెబుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో మొత్తంగా 43,903 మంది ఓటర్లు నమోదయ్యారు. స్టేషన్‌న్ ఘన్‌న్‌పూర్ మున్సిపాలిటీ పరిధి లో 18 వార్డుల పరిధిలో జనాభా 23,483గా నమోదైంది. ఇందులో 962 మంది ఎస్టీ, 6,663 మంది ఎస్సీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం ఓటర్ల సంఖ్య 18,549 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
వార్డుల వారీగా ఓటర్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
జనగామ పురపాలికలో స్టేషన్‌ఘన్‌పూర్ కలుపుకుని వార్డుల వారీగా ఓటర్ల విభజన జరుగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. వార్డుల వారీగా ఓటర్లు, పోలింగ్ స్టేషన్ మ్యాపింగ్ పనుల పురోగతిని సమీక్షించారు. ఓటర్ల జాబితాలో అధికారులు ఒక్క పొరపాటు కూడా ఉండకుండా చూడాలన్నారు. ప్రతి వార్డుకు సంబంధించిన డేటా తప్పులు లేకుండా మ్యాప్ చేయడం ఎన్నికల క్రమశిక్షణలో అత్యంత కీలకమని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ స్టేషన్ స్థాయి డేటాను తిరిగి వార్డుల వారీగా కేటాయించే పనిలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.
జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌లో హీటెక్కుతున్న రాజకీయాలు
మొదలైన రిజర్వేషన్ల లెక్కలు
రెండు మునిసిపాలిటీల్లో 62,556 ఓట్లు


