జగిత్యాలక్రైం: జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నంబరు ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేశారు. వాహన యజమానులకు సరైన ప్రామాణిక నంబరు ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించారు. పట్టణ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ, ప్రతి వాహనానికి నిబంధనల ప్రకారం నిర్దేశించిన నంబరు ప్లేట్లు ఉండాలని, నంబరు ప్లేట్ లేకుండా వా హనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ ఎస్సై మల్లేశ్ పాల్గొన్నారు.
అరుణాచలానికి ప్రత్యేక బస్సు
జగిత్యాల టౌన్: కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం జగిత్యాల డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపనున్నట్లు జగిత్యాల డిపో మేనేజర్ రమేశ్ శనివారం తెలిపారు. ఈనెల 22న మధ్యాహ్నం 12.30గంటలకు జగిత్యాల నుంచి బయల్దేరుతుందన్నారు. కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్ మీదుగా వెళ్తుందని తెలిపారు. 23న ఉదయం కాణిపాకం, సాయంత్రం వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం 24న ఉదయం అరుణాచలం చేరుకుంటుందన్నారు. రాత్రి అరుణాచలేశ్వరస్వామి దర్శనానంతరం బయల్దేరి 25న ఉదయం జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకుని రాత్రి జగిత్యాలకు చేరుకుంటుందన్నారు. ఆలయాల్లోని దర్శన, భోజన ఖర్చులు భక్తులే భరించాల్సి ఉంటుందన్నారు. ఈ యాత్రకు పెద్దలకు రూ.4,800, పిల్లలకు రూ.3,750 టికెట్ ధర నిర్ణయించినట్లు తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ ద్వారా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాష్ట్ర అడ్వకేట్ ఫెడరేషన్‌లో జిల్లాకు స్థానం
జగిత్యాలజోన్: రాష్ట్ర అడ్వకేట్ ఫెడరేషన్ సమావేశం హైదరాబాద్‌లో శనివారం జరిగింది. జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి బార్ అసోసియేషన్లకు చెందిన అధ్యక్షులు ఎర్ర నర్సయ్య, ఏలేటి రాంరెడ్డి, తోట అంజనేయులు, బందెల రమేశ్ పాల్గొన్నారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర అడ్వకేట్ ఫెడరేషన్ ఎన్నికలు జరుగగా, ఉపాధ్యక్షుడిగా ఎర్ర నర్సయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఏలేటి రాంరెడ్డి, తోట ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీలుగా అందె మారుతి, సుతారి శ్రీనివాస్, బందెల రమేశ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నల్ల రాజేందర్ ఎన్నికయ్యారు.
మూడు సహకార సంఘాలకు కొనుగోలు కేంద్రాలు మంజూరు
జగిత్యాల రూరల్: జిల్లాలోని మూడు సహకార సంఘాలకు కొనుగోలు కేంద్రాలను మంజూరు చేస్తూ జిల్లా పౌసరఫరాలశాఖ అధికారి జితేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో, సారంగాపూర్ మండల కేంద్రంలో, సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో మూడు సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.


