జగిత్యాలజోన్: కోర్టుల సంఖ్య పెరుగుతున్నా.. కక్షిదారులకు సకాలంలో న్యాయం అందే పరిస్థితులు కనిపించడం లేదు. జడ్జిల కొరత, సిబ్బంది లేమి, మౌలిక వసతుల లోపాలు న్యాయవ్యవస్థను వేధిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో ఇప్పటికే 15 కోర్టులు ఉండగా, ఇటీవల మరో ఆరు అదనపు కోర్టులు మంజూరయ్యాయి. దీంతో కోర్టుల సంఖ్య 21కు చేరింది. అయితే కొత్త కోర్టులకు జడ్జిలు, సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడంతో వాటి ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు జిల్లాలో సుమారు 17 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 5 వేల వరకు సివిల్, 12 వేల వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయి.
జిల్లాలో 21 కోర్టులు
జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రస్తుతం తొమ్మిది కోర్టులు ఉండగా, కొత్తగా మూడు అదనపు జ్యుడిషియ ల్ మేజిస్ట్రేట్ కోర్టులు మంజూరయ్యాయి. దీంతో అక్కడ కోర్టుల సంఖ్య 12కు చేరనుంది. మెట్‌పల్లిలో మూడు కోర్టులకు అదనంగా ఒకటి, కోరుట్లలో రెండు కోర్టులకు అదనంగా ఒకటి, ధర్మపురిలో ఉన్న కోర్టుకు అదనంగా మరొకటి మంజూరయ్యాయి. అయితే కొత్త కోర్టుల ఏర్పాటుకు సరైన భవనాలు లేకపోవడంతో తాత్కాలిక ప్రభుత్వ భవనాల కోసం అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది.
15 కోర్టులకు ఏడుగురే
జిల్లాలో ప్రస్తుతం ఉన్న 15 కోర్టులకు సంబంధించి ఏడు జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐదు కోర్టులకు, కోరుట్ల, ధర్మపురిలో ఒక్కో కోర్టుకు జడ్జిలు లేరు. దీంతో అందుబాటులో ఉన్న జడ్జిలపైనే అదనపు బాధ్యతలు పడుతున్నాయి. కొత్తగా మంజూరైన కోర్టులకు కూడా నియామకాలు చేపట్టకపోవడంతో కేసుల విచారణ, పరిష్కారంపై ప్రభావం పడుతోంది.
సిబ్బంది కొరత.. వసతుల లేమి
కోర్టుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది కూడా సరిపడా లేరు. అన్ని కోర్టులకు కలిపి సుమారు 243 మంది అవసరం కాగా, ప్రస్తుతం 133 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కొత్త కోర్టులకు సిబ్బంది నియామకాలు జరగలేదు. మరోవైపు పార్కింగ్, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కూడా కొన్ని కోర్టుల్లో కొరవడ్డాయి. కొత్త కోర్టులకు భవనాల అన్వేషణ కూడా న్యాయవాదులకు సవాలుగా మారింది.
జిల్లాలో 17 వేల వరకు పెండింగ్ కేసులు
15 కోర్టులకు ఏడుగురే జడ్జీలు
కొత్తగా మరో ఆరు కోర్టుల మంజూరు
సిబ్బంది కొరత.. వసతుల లేమితో ఇబ్బందులు


