పంచాయతీ హోదా ఉన్నా దక్కని రెవెన్యూ గుర్తింపు రికార్డుల్లో ఇప్పటికీ బండలింగాపూర్ పేరే.. మెట్పల్లి మండలం సత్తక్కపల్లి దుస్థితి రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని గ్రామస్థుల డిమాండ్
మెట్‌పల్లిరూరల్: పరిపాలన సౌలభ్యం కోసం పాలకులు, అధికారులు నిరంతరం కృషి చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. కొన్ని విషయాలను ఏ మాత్రమూ పట్టించుకోవడంలేదు. ఇందుకు మెట్పల్లి మండలం సత్తక్కపల్లి పరిస్థితి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. గ్రామానికి పంచాయతీ హోదా ఉన్నా.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం నేటికీ పొరుగు గ్రామమైన బండలింగాపూర్ పేరు మీదే కొనసాగుతోంది. ఈ విషయమై గ్రామస్తులు పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది.
1975లో గ్రామ పంచాయతీగా..
సత్తక్కపల్లి 1975లో పంచాయతీగా అవతరించింది. సుమారు 2 వేలకు పైగా జనాభా ఉంటుంది. భౌగోళికంగా ప్రత్యేకంగానే ఉంది. పంచాయతీ పాలనలో నడుస్తోంది. అయినా రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, ఇతరత్రా ప్రభుత్వ రికార్డుల్లో బండలింగాపూర్ పేరుతో నమోదవుతున్నాయి. పలు వ్యవహారాలకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్స్‌లో సత్తక్కపల్లి పేరు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి
2002లో గెజిట్ నోటిఫికేషన్
బండలింగాపూర్ రెవెన్యూ గుర్తింపు కలిగి ఉన్న సత్తక్కపల్లికి ప్రత్యేక రెవెన్యూ గుర్తింపు కల్పించేలా 2002లో అప్పటి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా బండలింగాపూర్, సత్తక్కపల్లి గ్రామాలకు సంబంధించిన ప్రతిపాదిత సర్వే నంబర్లను కూడా సిద్ధం చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ఏం జరిగిందో స్పష్టత లేదుగానీ.. ఇప్పటివరకు రెవెన్యూ హోదా మాత్రం దక్కలేదు.
ప్రజావాణిలో వినతి
తమ గ్రామానికి రెవెన్యూ గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ సత్తక్కపల్లి గ్రామస్తులు ఇటీవల జిల్లాకేంద్రంలోని కలెక్టరెట్‌కు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందించారు. ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.


