మెరుగైన విద్య..
జగిత్యాల: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. జూనియర్ కళాశాలల్లో సమయపాలన, విద్యార్థులు, అధ్యాపకుల హాజరు విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ బోర్డు పలు రకాల చర్యలు చేపడుతోంది. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల హాజరును ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌సీ) అమల్లోకి తీసుకొచ్చింది. గతేడాది ఎఫ్‌ఆర్సీ సిస్టం తీసుకొచ్చినప్పటికీ పెద్దగా అమలు కాలేదు. ఈసారి అమలు చేసేలా చర్యలు చేపడుతున్నారు. గతేడాది బయోమెట్రిక్ విధానం అమలు చేసినప్పటికీ సాంకేతిక కారణాలతో అమలు కాలేదు. ప్రస్తుతం కొత్త సాఫ్ట్‌వేర్‌తో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో విధులకు తప్పసరిగా హాజరు కావాల్సి ఉంటుంది.
టీబీబీఐఈ యాప్ ద్వారా..
జూనియర్ కళాశాలల్లో ప్రత్యేకంగా రూపందించిన తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీబీబీఐఈ) యాప్ ద్వారా హాజరును నమోదు చేస్తారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు కచ్చితంగా రోజులో రెండుసార్లు చేయాల్సి ఉంటుంది. ఉదయం కళాశాలకు హాజరైన 9.30 గంటల
లోపు.. సాయంత్రం 4 గంటల తర్వాత ముఖ గుర్తింపుతో ఎఫ్‌ఆర్సీ కచ్చితంగా హాజరు వేయాల్సి ఉంటుంది. విద్యార్థుల హాజరు కూడా ఇలాగే అమలు చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు, సిబ్బందికి శిక్షణ కల్పించారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో అమలు కానున్నట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ అధికారులు తెలిపారు.
16 కళాశాలల్లో అమలు
జిల్లాలో 16 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అన్ని కళాశాలల్లో ఇది అమల్లోకి రానుంది. ఫస్టియర్, సెకండియర్‌లో కలిపి సుమారు 3 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అధ్యాపక బృందం, ఇతర సిబ్బంది 200 మంది ఉన్నారు. యాప్‌లో వీరికి సంబంధించిన డాటా పూర్తి కాగానే ఇది అమలులోకి రానుంది.
జూనియర్ కళాశాలల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్
అధ్యాపకుల డుమ్మాలకు ఇకనుంచి చెక్
టీబీబీఐఈ యాప్ ద్వారా నమోదు
జిల్లాలో కళాశాలలు 16
మూడు వేల మంది విద్యార్థులు
డుమ్మాలకు చెక్..
గతంలో ఈ విధానం లేకపోవడంతో అధ్యాపకులు కళాశాలకు లేటుగా రావడం, ఒకరు బదులు మరొకరు హాజరు వేయడం వంటివి జరిగేవి. ఎఫ్‌ఆర్సీ విధానంతో ప్రతి ఒక్కరు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ విధానంతో ఇటు అధ్యాపకులు, అటు విద్యార్థులు హాజరు శాతం పెరగడంపాటు మెరుగైన విద్య అందుతుంది.


