తూకంలో మోసం..! | - | Sakshi
Sakshi News home page

తూకంలో మోసం..!

Sep 28 2026 1:35 AM | Updated on Sep 28 2026 1:35 AM

జగిత్యాల: జిల్లాలోని కిరాణాలు.. సూపర్‌మార్కెట్లలో తూకాల్లో అనేక మోసాలు జరుగుతున్నాయి. వేయింగ్‌ మిషన్లలోని లొసుగులను తెలుసుకున్న వ్యాపారులు కిలోకు 150 గ్రాముల వరకు తక్కువగా ఇస్తూ వినియోగదారులను నష్టపరుస్తున్నారు. వివిధ వస్తువులన్నీ ప్యాకెట్లలోకి మారుస్తూ.. చిన్న స్టిక్కర్‌ అంటిస్తూ మోసం చేస్తున్నారు. చిన్న, పెద్ద కిరాణాలు, సూపర్‌మార్కెట్లల్లో ప్రతీ వస్తువు ప్యాకెట్ల రూపంలోనే అమ్ముతున్నారు. కొన్నిచోట్ల స్టిక్కర్లు వేయకుండా.. బరువు, ధర లేకుండానే విక్రయిస్తున్నారు. సూపర్‌ మార్కెట్లల్లో పెద్దపెద్ద కిరాణాలతోపాటు చిన్న కిరాణాల్లో ఏ వస్తువుపైనా ప్యాకింగ్‌.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉండాలి. కూరగాయల మార్కెట్‌ నుంచి కొన్ని కిరాణంల్లో వేయింగ్‌ మిషన్ల ద్వారా సరుకులు ఇస్తుంటారు. పెద్ద పెద్ద కిరాణాల్లో వేయింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసి అందులో దాదాపు కిలోకు 150 గ్రాములు మోసాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా.. తూనికలు, కొలతల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఓ వైపు తూకాల్లో మోసం చేయడంతోపాటు, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ అనుమతులు లేకుండానే ప్రతి వస్తువును ప్యాకెట్ల రూపంలో నింపుతూ ప్రజలకు విక్రయిస్తున్నారు. పావుకిలో, అర్ధకిలో, కిలో రూపంలో ప్యాకెట్లు నింపుతూ వ్యాపారులు విక్రయిస్తున్నారు. తూనికల కొలతల శాఖల అధికారులు అప్పుడప్పుడే దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

అనుమతి లేకుండానే..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా నిత్యావసర వస్తువులు ప్యాకింగ్‌ చేయాలంటే తప్పనిసరిగా తూనికల కొలతల శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ అనుమతులు లేకుండానే కిరాణాల్లో కందిపప్పు, పెసరపప్పు, చక్కెర, గోధుమపిండి, మైద ప్యాకింగ్‌ చేస్తూ విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి పెద్దపెద్ద బస్తాల్లో సరుకులను తీసుకువచ్చి ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిత్యావసర వస్తువులపై సంబంధి కంపెనీ చిరునామాతో పాటు పూర్తి వివరాలు ఉండాలి. ప్రతి ప్యాకెట్‌పై దాని బరువు, ఎప్పుడు ఎక్కడ తయారుచేశారో తేదీ పాటు గడువు తేదీ కలిగి ఉండాలి. కానీ ఇలాంటివీమీ సూపర్‌ మార్కెట్‌, కిరాణాల్లో కన్పించడం లేదు.

జోరుగా జీరో దందా...

పన్నులు తప్పించుకోవడానికి వ్యాపారులు జీరో దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్యాకెట్లపై ఎలాంటి ముద్రణ, తేదీ, కన్జుమర్‌ నంబరు లేకుండానే కిలో, అరకిలో, పావుకిలో చొప్పున విక్రయిస్తూ జీరో దందాను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి పన్ను ఎగవేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

పట్టించుకోని అధికారులు

తూనికల కొలతల శాఖ అధికారులు ఉన్నా పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. నెలలో ఒక్కసారైనా తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వ్యాపారులదే ఇష్టారాజ్యంగా మారింది. షాపుల్లో తరాజు, బాట్లు వ్యత్యాసం రాకుండా నిత్యం తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ అలాంటివేమీ చేయడం లేదు. ప్రతి సంవత్సరం కిరాణం వారు తరాజులు, బాట్లకు స్టాంపు వేయించుకుంటారే తప్ప ఎలాంటి నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రేట్లల్లో సైతం తేడాలు

నిబంధనల ప్రకారం ఎమ్మార్పీ రేట్లపైనే వస్తువులను విక్రయించాల్సి ఉండగా కొన్ని షాపుల్లో నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేట్లకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.

తూనికలు, కొలతల అధికారుల పర్యవేక్షణ కరువు

నష్టపోతున్న వినియోగదారులు

ఇప్పటి వరకు నమోదైన కేసులు 60

రూ.4.33లక్షల జరిమానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement