మెట్‌పల్లిరూరల్: గ్రామ అభివృద్ధి కమిటీల పేరిట ఏర్పడిన వీడీసీలు అదే అభివృద్ధి పనుల విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్నాయి. తమ మాటే చెల్లుబాటయ్యేలా పెత్తనం చెలాయిస్తున్న వీడీసీలు.. తాజాగా ప్రభుత్వం చేపడుతున్న మహిళా గ్రామైక్య సంఘ భవన నిర్మాణాల్లో జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ కమిటీలు తీసుకునే నిర్ణయాలు కొంతవరకు గ్రామాలకు మేలు చేస్తుండగా.. మరికొన్ని మాత్రం వివాదానికి దారితీస్తున్నాయి. మెట్‌పల్లి మండలంలో గ్రామైక్య సంఘ భవనాల కోసం ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. ఇందుకోసం స్థలాలు ఎంపిక చేసి పనులు ప్రారంభించగా.. పలు చోట్ల వీడీసీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో కొన్ని గ్రామాల్లో పనులు ప్రారంభం కాలేదు. పనులు త్వరగా చేయాలని ఓవైపు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి.. మరోవైపు వీడీసీలు అభ్యంతరం తెలుపుతుండడంతో కాంట్రాక్టర్లు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఒక్కో భవనానికి రూ.10 లక్షలు
మెట్‌పల్లి మండలంలో 24 గ్రామైక్య సంఘాల భవన నిర్మాణాలకు వీబీజీ రామ్‌జీ పథకం నుంచి నిధులు మంజూరయ్యాయి. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున కేటాయించారు. కొన్ని గ్రామాల్లో స్థల సమస్యతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరికొన్ని ఎంపిక చేసిన స్థలాలపై వివాదాలు చోటుచేసుకోవడంతో భవనాలు ఎక్కడ నిర్మించాలనేది సమస్యగా మారింది. కొన్ని చోట్ల పనులు ప్రారంభమై తుది దశకు చేరుకోగా, మరికొన్ని చోట్ల ప్రారంభమే కాకపోవడం, ప్రారంభమైనా నిలిపివేయడం వంటి పరిస్థితి నెలకొంది. నవంబర్‌లోపు భవన నిర్మాణాలు పూర్తిచేయాలని అధికారులు చెబుతున్నప్పటికీ.. స్థలాల విషయంలో వివాదాలు చోటుచేసుకోవడంతో అంతలోపు నిర్మాణాలు పూర్తి చేయడం ఎలా సాధ్యమనేది ప్రశ్నగా మారింది.
పనులు ప్రారంభించి..నిలిపివేసి..
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్, బండలింగాపూర్‌లో గ్రామైక్య సంఘ భవన నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం విషయంలో అక్కడి వీడీసీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఎంపిక చేసిన స్థలాలపై అభ్యంతరాలు ఉండడంతో ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికీ పనులు ప్రారంభంకాలేదు. జగ్గాసాగర్‌లో ఎంపిక చేసిన స్థలంలో పనులకు భూమిపూజ చేసి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. వెంటనే పనులు ప్రారంభించకుండా నిలిపివేశారు. ఎంపిక చేసిన స్థలంలో కాకుండా మరోచోట స్థలం ఉందని, అక్కడే భవనం నిర్మించాలని సూచించినట్లు తెలిసింది. బండలింగాపూర్‌లో గ్రామ పంచాయతీ పక్కనే స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ గ్రామంలోని సంఘాలకు మూడు భవనాలు మంజూరు కాగా.. ఎంపిక చేసిన చోట ఒకే భవనాన్ని నిర్మించాలని, మిగతావి మరో చోట నిర్మించాలని చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో గుంతలు తవ్వి పనులను మధ్యలోనే నిలిపివేశారు. ఇవే కాకుండా మరికొన్ని గ్రామాల్లో స్థలాల కొరతతో పనులు ప్రారంభంకాలేదు. మహిళా గ్రామైక్య సంఘాలకు భవనాలు లేకపోవడంతో ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించారు. చాలా ఏళ్లకు భవనాలకు నిధులు మంజూరయ్యాయి. ఇకముందు ఇబ్బందులు తప్పుతాయని ఆశపడ్డ వారికి పనుల్లో జాప్యంతో నిరాశకు గురువుతున్నారు. మొత్తంగా అభివృద్ధి పనుల్లో వీడీసీల జోక్యం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహిళా గ్రామైక్య సంఘ భవన నిర్మాణాల్లో వీడీసీ జోక్యం
స్థలాల విషయంలో అభ్యంతరాలు
వీడీసీల అభ్యంతరంతో నిలిచిపోయిన పనులు


