మల్యాల: కొండగట్టు అంజన్న ఎదపై సూర్య కిరణాలు పడి భక్తులను పరవశింపజేశాయి. ఆదివారం ఉదయం తూర్పు కొండల నుంచి భానుడి కిరణాలు సింహద్వారం మీదుగా నేరుగా స్వామివారి మూలవిరాట్టుపై పడిన దృశ్యం చూసి భక్తులు పులకరించిపోయారు.
ధర్మపురిలో నగర సంకీర్తన
ధర్మపురి: ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఆదివారం నగర సంకీర్తన ఘనంగా నిర్వహించారు. 30 గంటలు అభ్యసవర్గ కార్యక్రమం నేపథ్యంలో ఏకల్ అభ్యస్ శ్రీహరి సత్సంగ్ సేవాసమితి ఆధ్వర్యంలో నందికూడలి నుంచి దేవాలయం వరకు ఆచార్య, మాతాలతో సంకీర్తన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సంచు సమితి అధ్యక్షులు లింగారెడ్డి, ఉపాధ్యక్షుడు నరేష్ అంచల్ సాధక్ కవిత, మాధురి, నర్సయ్య, రంగు లక్ష్మినరహరి, రాయిల్ల రవికుమార్ తదితరులున్నారు.
మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతాం
జగిత్యాలజోన్:మహిళలందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని డీఆర్‌డీఏ పీడీ రఘువరుణ్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 386 పరీక్ష కేంద్రాల్లో 19,304 మంది మహిళలకు ఉల్లాస్ పరీక్షను ఆదివారం నిర్వహించారు. ఈ పరీక్షలను పీడీ పరిశీలించారు. మహిళా సంఘాల్లోని ప్రతిఒక్కరినీ అక్షరాస్యులుగా మార్చేందుకు సెర్ప్ ప్రయత్నిస్తోందన్నారు. అంబారిపేట సర్పంచ్ గంగాధర్, డీపీఎం నాగేశ్వర్‌రావు, ఏపీఎం వి.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


