మేడిపల్లి: మండలంలోని కొండాపూర్ ఊరచెరువు మత్తడిపై వంతెన, కొండాపూర్–ఒడ్యాడ్ గ్రామాల మధ్య తారురోడ్డు నిర్మించాలని శుక్రవారం బీజేపీ మేడిపల్లి, భీమారం మండలాల అధ్యక్షులు చిట్యాల సురేశ్, నాగం శివకుమార్ ఆధ్వర్యంలో చెరువు మత్తడి వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, వంతెన నిర్మాణానికి విప్ ఆది శ్రీనివాస్ ప్రొసీడింగ్ ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసినా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాలేదన్నారు. వెంటనే వంతెన, రోడ్డు నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ క్యాతం దశరథారెడ్డి, చందా రమేశ్, పాకల్ల సాయిరాం, నీలం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


