బాధ్యతలు నిర్వహించలేక.. భారం మోయలేక.. పాఠశాలల్లో వసతుల లేమి.. సిబ్బంది కొరత బోధనేతర పనులతో ఒత్తిడి విద్యావలంటీర్లు లేక ఇక్కట్లు ఉపాధ్యాయుల్లో ఆందోళన
జగిత్యాల: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఇతర ఉపాధ్యాయులచే నిత్యం పర్యవేక్షణ, అధికారుల సందర్శన, తరగతి గదుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ పాఠశాలల నిర్వహణ సజావుగా చేయలేకపోతున్నారు. దీంతో మనోవేధనకు గురవుతున్నారు. పాఠశాలల్లో కనీస వసతులు కల్పించకుండా ఎఫ్‌ఎల్‌ఎన్ పేరుతో తోటి ఉపాధ్యాయులచే పర్యవేక్షణ చేయిస్తూ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులపై ప్రభుత్వం తీవ్ర భారం మోపుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదికి ఒక ఉపాధ్యాయున్ని నియమించినప్పుడే ఆశించిన ఫలితాలుంటాయి. కానీ, పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవడంతో కనీసం తాత్కాలికంగా విద్యావలంటీర్లను నియమిస్తే గుణాత్మకమైన విద్యనందించే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పర్యవేక్షణ, తనిఖీలు
ప్రాథమిక పాఠశాలల్లో కేవలం ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయు ఉండడం, ఐదు తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్‌లు బోధించడంతో పాటు, అనేక బోధనేతర పనులు సైతం ఉండటంతో ప్రధానోపాధ్యాయ బాధ్యతల వల్ల ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారు. ఉపాధ్యాయుల కొరత ఉండటంతో పాటు, పదేపదే ఇతర అధికారుల పర్యవేక్షణ, ప్యానల్స్ టీం రూపంలో పాఠశాలలను తనిఖీ చేయడం జరుగుతుంది. దీంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పడుతోంది.
జీవో రద్దు చేయాలని డిమాండ్
జీవో నంబరు 25 ప్రకారం 60 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండాలని సూచిస్తుంది. ఇది అశాసీ్త్రయమైనదని, దీనిని రద్దు చేయాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు, ఒక ఉపాధ్యాయున్ని కేటాయించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
తరుచూ సందర్శన
ఎఫ్‌ఎల్‌ఎన్ (తొలిమెట్టు) కార్యక్రమంలో భాగంగా తోటి ఉపాధ్యాయులచే పర్యవేక్షణ చేయించడంతో తరుచూ ఈ పాఠశాలలను టీంలు సందర్శించడం, వారి బోధన ఎలా ఉంది, వారు ఏ విధంగా పనిచేస్తున్నారని కనిపెట్టి విద్యార్థులకు ఎలాంటి బోధన అందిస్తున్నారని చూస్తుంటారు. తరుచూ సందర్శించడంతో ఉపాధ్యాయులపై తీవ్ర భారం పడుతోంది. అయితే కొన్ని చోట్ల కొందరు ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిసింది.
‘గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రశాంత్ అనే ఉపాధ్యాయుడు ఇటీవల తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. ఉపాధ్యాయుల కొరత, నిత్యం పర్యవేక్షణ, అధికారుల సందర్శన, తరగతి గదుల కొరత, బోధనేతర పనులతో ఒత్తిడికి గురైనట్లు మండల విద్యాధికారికి లేఖ సైతం రాశాడు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యావలంటీర్లు లేకపోవడంతో అందులో పనిచేస్తున్న ఎస్జీటీలపై అధిక భారం పడుతోంది. ఫలితంగా ఒత్తిడికి లోనవుతున్నారు’.


