జగిత్యాలజోన్: సమాజంలో వృద్ధులను గౌరవించడం, ఆదరించడం అందరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మట్ట సరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీగాయత్రి అనాథ వృద్ధాశ్రమాన్ని శుక్రవారం సందర్శించారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి మాట్లాడారు. వృద్ధులను వేధిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని, తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత వారి సంతానంపై ఉందన్నారు. ఆస్తుల కోసం హింసిస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. వృద్ధులకు ఏదైనా సమస్య వస్తే జిల్లా కోర్టులోని న్యాయ సేవా సంస్థను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా వృద్ధులకు అందుతున్న సౌకర్యాలను, భోజన వసతులను పరిశీలించారు.
నవంబర్ 17న లోక్ అదాలత్
మెట్‌పల్లి: చెక్‌బౌన్స్, బ్యాంక్ లోన్ రికవరీకి సంబంధించిన కేసుల పరిష్కారం కోసం నవంబర్ 17న ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని కోర్టు కాంప్లెక్స్‌లో శుక్రవారం న్యాయవాదులతో సమావేశమయ్యారు. చెక్‌బౌన్స్ కేసుల విషయంలో కక్షిదారుల మధ్య రాజీ కుదుర్చడానికి న్యాయవాదులు చొరవ తీసుకోవాలన్నారు. పంతాలకు పోతే జరిగే నష్టాల గురించి వారికి వివరించాలన్నారు. ప్రత్యేక లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలన్నారు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మాధవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి రాంరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
మేడిపల్లి: భీమారం మండల కేంద్రంతో పాటు రాజలింగంపేట గ్రామాల్లో శుక్రవారం కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా పర్యటించారు. రాజలింగంపేట గ్రామ పంచాయతీ భవనం, ఇటీవల దెబ్బతిన్న పసుపూర్– రాజలింగంపేట లో లెవల్ వంతెన మరమ్మతు పనులు పరిశీలించారు. భీమారంలో నిర్మిస్తున్న అంగన్‌వాడీ భవనాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
గిరిజన గురుకులం సందర్శన
రాయికల్(జగిత్యాల): ట్రైనీ అడిషనల్ కలెక్టర్ హరిణి ఉపాధ్యాయ అవతారమెత్తి 7వ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్‌పై ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు. శుక్రవారం మండలంలోని జగన్నాథపూర్‌లో గిరిజన గురుకులాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు సరఫరా చేస్తున్న పదార్థాల్లో నాణ్యత, తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆమె వెంట తహసీల్దార్ నాగార్జున, ఆర్‌ఐ పద్మయ్య, ఇన్‌చార్జి హెచ్‌ఎం శిరీష ఉన్నారు.
పండిట్ దీన్‌దయాల్‌కు నివాళి
జగిత్యాల: పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ 110వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జనసంఘ్‌లో విశిష్ట సేవలందించిన గొప్ప జాతీయవాది పండిట్ దీన్‌దయాల్ అని కొనియాడారు. నాయకులు నలువాల తిరుప తి, మర్రిపల్లి సత్యం, సత్యనారాయణ, పు ప్పాల శ్రీనివాస్, మానుప్రియ, దుర్శెట్టి మమ త, నారపాక అశోక్, ఆముద రాజు, శ్రవణ్‌కుమార్, తిరుపతి పాల్గొన్నారు.


