జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలం రంగపేటలో రూ.11 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం భూమిపూజ చేశారు. రూ.56 లక్షలతో చేపట్టిన రంగపేట–ఆలూరు వయా బతుకమ్మ కుంట ఫార్మేషన్ రోడ్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా గ్రామంలో పలువురు ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరై కానుకలు అందించారు. నియోజకవర్గంలో దళితులకు 909 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. పెంబట్ల, కోనాపూర్ బ్రిడ్జి విషయంలో నాడు సీనియర్ నాయకులు మంత్రిగా ఉండి కూడా ఏం చేయలేదని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. రూ.3 కోట్లతో బ్రిడ్జి నిర్మించి కాంట్రాక్టర్‌కు బకాయిలు కూడా చెల్లించడం జరిగిందన్నారు. అనంతరం బీర్‌పూర్ గ్రామపంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, మైక్ సెట్‌ను ప్రారంభించారు. ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సర్పంచ్‌లు ఏదుల శేఖర్, హరీశ్, ఎంపీడీవో నీరజ, ఎంపీవో సలీం తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రాయికల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలం చింతలూరు గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరయ్యారు. సర్పంచ్ రమేశ్‌నాయక్, ఆ త్మ చైర్మన్ గంగారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
హామీలు అమలు చేసేవరకు నిలదీసుడే
ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసేవరకు నిలదీసుడేనని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల దగాపై శుక్రవారం మండలకేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద వంటావార్పుతో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా కొట్లాడుడేనని పేర్కొన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డిని గద్దె దించే వరకు పోరాడుదామని, కేసీఆర్ అధికారంలోకి వచ్చే దాకా కొట్లాడుదామన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి 420 హామీలు ఇచ్చి 420 అయ్యారన్నారు. హామీలు అమలు చేసే వరకు గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను నిలదీయాలన్నారు. అనంతరం వంటావార్పులో భాగంగా సహపంక్తి భోజనం చేశారు. మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, నోముల లక్ష్మారెడ్డి, చిన్నారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఏలాల దశరథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసులు ఉపసంహరించుకోవాలి
మెట్‌పల్లి(కోరుట్ల): ఉత్తరాఖండ్‌లో రాహుల్‌గాంధీపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు డిమాండ్ చేశారు. కేసులను వ్యతిరేకిస్తూ పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సభ నిర్వహించిన ప్రాంతాన్ని శుద్ధి చేయడంపై ప్రశ్నించిన రాహుల్‌గాంధీపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను కేసులతో అణచివేయాలని చూడడం ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదన్నారు. కేసులను ఉపసంహరించుకోవాలని లేకుంటే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


