జగిత్యాలరూరల్: రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్‌రెడ్డి పాలన కొనసాగుతోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై శుక్రవారం సారంగాపూర్ మండలం పెంబట్లలో నిరసన ర్యాలీ నిర్వహించి వంటావార్పు కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు రోజులు దగ్గరపడ్డాయని, రేవంత్‌రెడ్డి రియల్‌ఎస్టేట్ వ్యాపారి అని, రైతుల భూములను 22ఏ లో పెట్టి వారి గోస పోసుకుంటున్నాడని విమర్శించారు. వెయ్యి రోజుల పాలన సంబురాలు ఎందుకు చేసుకుంటున్నరో చెప్పాలన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వనందుకా, పింఛన్ రూ.2,000 నుంచి రూ.4,000 పెంచుతామని మాట తప్పినందుకా, మహిళలకు రూ.2,500 ఇస్తామన్న హామీ నెరవేర్చనందుకా అని ఎద్దేవా చేశారు. దేవుని కండువా కప్పుకొని అభివృద్ధి చేస్తున్న అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే ఎందుకు రోడ్లు మరమ్మతు చేయడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 పెన్షన్ ఇస్తే, కేసీఆర్ పదింతలు చేసి రూ.2,000 ఇచ్చారన్నారు. రేవంత్‌రెడ్డి రూ.4,000 పెన్షన్ ఇస్తామని వెయ్యి రోజులు గడుస్తున్నా ఒక్కరికి ఇవ్వలేదని ఆరోపించారు. ఆడబిడ్డలకు రూ.2,500 ఇస్తామని చెప్పి మోసం చేశాడని, వారి ఉసురు పోసుకుంటున్న రేవంత్ బాగుపడరన్నారు. అభివృద్ధి అని జగిత్యాల్ ఎమ్మెల్యే, రేవంత్‌రెడ్డి చంకలో చేరాడన్నారు. గ్రామాలకు ఉపాధి హామీ నిధులు సైతం మంజూరు చేయకుండా సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, కేసీఆర్ నిరుపేద ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మీ కింద రూ.లక్ష ఇచ్చారని, రేవంత్‌రెడ్డి కల్యాణలక్ష్మీకి తోడు తులం బంగారం ఇస్తామని చెప్పి గురిజ కూడా ఇవ్వడం లేదని, కల్యాణలక్ష్మీ కూడా ఎగ్గొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి మహిళలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, పాక్స్ చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, మాజీ చైర్మన్ సత్యంరావు తదితరులు పాల్గొన్నారు.


