జగిత్యాలఅగ్రికల్చర్: పప్పుధాన్యాల సాగుకు నిలయమైన జిల్లాలో క్రమక్రమంగా ఆ ప్రభావాన్ని కోల్పోతోంది. సాగునీటి వనరులు పెరగడం.. పొడి వాతావరణం తగ్గుతుండటంతో పప్పుధాన్యాల సాగు వదిలి రైతులు వరి వైపు మొగ్గు చూపుతున్నారు. పప్పుధాన్యాల సాగుకు ఖర్చు పెరగడం.. ఆదాయం అంతంతమాత్రంగానే ఉండటంతో పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఉత్పత్తులు తగ్గడంతో మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. కందిపప్పు కిలో రూ.130, మినపప్పు రూ.125, పెసర రూ.130, శనగ రూ.90కి చేరింది.
2,200 ఎకరాల్లో సాగు
జిల్లామొత్తంగా నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తే కేవలం 2200 ఎకరాల్లో మాత్రమే పప్పుధాన్యాలు సాగవుతున్నాయి. అందులోనూ కంది 949 ఎకరాల్లో సాగవుతోంది. అది కూడా అత్యధికంగా జగిత్యాల రూరల్, ఎండపల్లి మండలాల్లోనే. పెసర 245 ఎకరాల్లో సాగవుతోంది. అత్యధికంగా మల్లాపూర్, వెల్గటూర్ మండలాల్లో, మినుములు మేడిపల్లి మండలంలో 8 ఎకరాల్లో, అనుములు 246 ఎకరాల్లో సాగవుతుండగా.. అత్యధికంగా కొడిమ్యాల మండలంలో పండిస్తున్నారు. సోయాబీన్ 740 ఎకరాల్లో ఇబ్రహీంపట్నం మండలంలోనే పండిస్తున్నారు. పప్పుధాన్యాల పంటల్లో కలుపు మొక్కలు పెరుగుతుండటం, తొలగించేందుకు కూలీలు అవసరం అవుతుండటం రైతులకు పెద్ద సమస్యగా మారింది. గతంలో రైతులు తమ ఇంటి అవసరాల కోసం కొంత విస్తీర్ణంలోనైనా పప్పుదినుసులు సాగు చేసేవారు. ఇప్పుడు రైతులు కూడా పప్పులను మార్కెట్‌లో కొంటున్నారు. విస్తీర్ణం పడిపోవడానికి కారణాలు పప్పుధాన్యాల పంట అకాలవర్షాలకు పురుగులు, తెగుళ్లు వ్యాపించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోతకు సరైన ఆధునిక యంత్రాలు లేకపోవడం, కూలీలపైనే ఆధారపడాల్సి రావడంతో ఆదాయం కంటే ఖర్చే ఎక్కువ. దిగుబడి కూడా తక్కువగా ఉంటుంది. పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. కందులు క్వింటాల్‌కు రూ.7నుంచి 8వేలు, పెసర రూ.6500 నుంచి రూ.8600, మినుములు రూ.6500 నుంచి రూ.7500, అలసంద రూ.6500 పలుకుతున్నాయి. ఏ పప్పు ధాన్యమైనా ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్లు మించడం లేదు.
2,200 ఎకరాలకు పడిపోయిన పప్పుధాన్యాల సాగు
సాగుకు ఖర్చు ఎక్కువ.. దిగుబడి తక్కువ
మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి దిగుమతి


