కథలాపూర్(వేములవాడ): ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు కంప్యూటర్ బోధనను చేరువ చేసేందుకు కేంద్ర విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే జిల్లాలోని అన్ని కళాశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్(ఐఎఫ్‌పీ)లను సమకూర్చి వాటి ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది. తాజాగా ఇంటర్ విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం పెంపొందించడానికి కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది.
మొదటి దశ మూడు కళాశాలల్లో.
జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలున్నాయి. ఏఐ (ఆర్టిఫిషీయల్ ఇంటలీజెన్స్) సాంకేతికతతో విద్యావ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్ విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించేందుకు జిల్లాలో మొదటి దశలో కోరుట్ల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, జిల్లాకేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్ ప్రభుత్వ బాలుర కళాశాల, మెట్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒకొక్క కళాశాలకు రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.75 లక్షలు మంజూరైనట్లు జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి రమేశ్‌బాబు తెలిపారు. పుస్తక జ్ఞానానికి పరిమితమయ్యేవారు కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడంతో ఇకపై ప్రయోగాత్మకంగా కోడింగ్, డిజైనింగ్ వంటి ప్రాజెక్టులను స్వయంగా నేర్చుకునే అవకాశం దక్కుతుందని లెక్చరర్లు చెబుతున్నారు. గ్రూపులవారీగా అభ్యసనం, ప్రాజెక్టుల రూపకల్పన ద్వారా విద్యార్థులకు అనుభవాత్మక విద్య అందుతుందని అంటున్నారు.
జిల్లాలో మూడు కళాశాలల్లో ల్యాబ్‌లు
ఏర్పాటుకు రూ.75 లక్షలు మంజూరు


