గన్నేరువరం: తన భర్త రాజేందర్‌రెడ్డి మృతి చెందిన కేసులో ఇంత వరకు న్యాయం జరగలేదని గుండ్లపల్లి మాజీ సర్పంచ్ బేతెల్లి సమత శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త పెద్దకర్మ రోజు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తమ ఇంటికి వచ్చి పరామర్శించి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చి వెళ్లారని తెలిపారు. శుక్రవారం గుండ్లపల్లిలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యేకు తమ ఇంటి రావడానికి సమ యం దొరకలేదా అని ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, మూడు రోజులు గడువు ఇస్తున్నానని, న్యాయం జరగకపోతే సీఎం కార్యాలయం లేదా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయిస్తానని హెచ్చరించారు.
వృద్ధురాలి ఆత్మహత్య
కోరుట్లరూరల్: మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన కస్తూరి వెంకమ్మ (81) మతి స్థిమితం సరిగా లేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. వెంకమ్మ కాలుకు ఏడాది క్రితం శస్త్రచికిత్స చేయించారు. కాలు నొప్పి కారణంగా ఆరునెలల నుంచి రెండుసార్లు కిందపడడంతో మెదడులోని నరాలు దెబ్బతిని మతిస్థిమితం కోల్పోయింది. గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయి గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కూతురు బోదాసు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇంజక్షన్ వికటించి మహిళ మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు పందిళ్ల శ్రీనివాస్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. మహిళ తండ్రి చాతాని రాంరెడ్డి తెలిపిన వివరాలు. తన కూతురు అరుణ అనారోగ్యంతో బాధపడుతుండగా.. వారం రోజుల క్రితం ఆర్‌ఎంపీ ఇంజక్షన్ ఇవ్వడంతో చనిపోయినట్లు తెలిపారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. తన బిడ్డ మృతికి ఆర్‌ఎంపీ వైద్యుడే కారణమని ఆరోపించారు. ఈ విషయంపై ఎస్సై రమేశ్‌గౌడ్‌ను వివరణ కోరగా.. ఫిర్యాదుపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఇంకా కేసు నమోదు చేయలేదని దర్యాప్తు చేస్తున్నామన్నారు.


