భూభారతి ఆపరేటర్లు ఉండేనా..? | - | Sakshi
Sakshi News home page

భూభారతి ఆపరేటర్లు ఉండేనా..?

Aug 10 2026 1:28 AM | Updated on Aug 10 2026 1:28 AM

జగిత్యాల: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి చట్టం సమయంలో మండలాల్లో ఫీల్డ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ (ఎఫ్‌టీఎస్‌) వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటినుంచి వారు భూ సమస్యలకు సంబంధించిన అంశాలను చూశారు. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తహసీల్దార్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా జూనియర్‌ అసిస్టెంట్లకు ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌, భూ రిజిస్ట్రేషన్లు, స్లాట్‌ బుకింగ్‌పై శిక్షణ కూడా ఇస్తున్నారు. భూభారతి ఆపరేటర్లను తొలగించేందుకే శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. దీంతో భూభారతి ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల భూ రిజిస్ట్రేషన్లు, స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ నిలిచిపోయాయి. ఒకవేళ వారిని పూర్తిస్థాయిలో తొలగించి జూనియర్‌ అసిసెంట్లకు బాధ్యతలు ఇస్తే వారి భవిష్యత్‌ అంధకారం కానుంది. ఇప్పటికే భూభారతి ఆపరేటర్లకు ఒకవైపు వేతనాలు సక్రమంగా రాక ఇబ్బందులకు గురిచేస్తుంటే మళ్లీ జూనియర్‌ అసిస్టెంట్లకు భూభారతి చట్టంపై శిక్షణ ఇవ్వడంతో తమను తొలగిస్తారని ఆందోళన చెందుతున్నారు. భూభారతి ఎఫ్‌టీఎస్‌ ఆపరేటర్లను యథావిధిగా కొనసాగించాలని, పెండింగ్‌లోని వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మొత్తం 22 మంది భూభారతి ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు.

యథావిధిగా కొనసాగించాలి

యథావిధిగా కొనసాగించాలని భూభారతి ఆపరేటర్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే వేతనాలు రాక ఇబ్బంది ఎదుర్కొంటున్నామని, తొలగిస్తారనే ఆందోళన చెందుతున్నామన్నారు. రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పినప్పటికీ ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని ఉన్న తమకు జూనియర్‌ అసిస్టెంట్లుగా శిక్షణ ఇవ్వడం ద్వారా తొలగిస్తారని సంకేతాలు వస్తున్నాయని వాపోతున్నారు. జూనియర్‌ అసిస్టెంట్లకు మొబైల్‌ ద్వారా భూభారతి రిజిస్ట్రేషన్లపై శిక్షణ ఇచ్చినట్లు తెలిసింది. ఏదేమైనా భూభారతికి చెందిన కంప్యూటర్‌ ఆపరేటర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

జూనియర్‌ అసిస్టెంట్లకు శిక్షణ

ఆందోళనలో ఎఫ్‌టీఎస్‌ ఆపరేటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement