కొడిమ్యాల: విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా.. స్వయంగా స్టార్టప్ కంపెనీలు పెట్టే స్థాయికి చేరుకోవాలని జేఎన్టీయూ (హైదరాబాద్) వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కిషన్‌కుమార్ రెడ్డి అన్నారు. మండలంలోని జేఎన్టీయూ (నాచుపల్లి)లో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు 20వ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన కిషన్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాప్రస్థానం ఇంటర్ తర్వాత నుంచే ప్రారంభమవుతుందని, ఎలాంటి సంకోచం లేకుండా ప్రశ్నలు అడిగి కొత్త విషయాలు నేర్చుకునే అలవాటు పెంచుకోవాలని సూచించారు. భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం, ఆంగ్ల భాషలో బలమైన పునాది అవసరమని, ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని సూచించారు. పాఠ్య, సహపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాలు, ఏఎస్‌ఎస్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలని వివరించారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా కృషి చేయాలని సూచించారు. జేఎన్టీయూ(హెచ్) విద్యార్థులు స్థాపించిన 70 స్టార్టప్‌లలో 40నుంచి 50 శాతం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులవేనని తెలిపారు. థర్డియర్, ఫోర్త్‌ఇయర్ విద్యార్థులు రెండు నెలల విరామాన్ని ఇంటర్న్‌షిప్, పరిశోధన, ప్రాజెక్టు పనులకు వినియోగించుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ నరసింహ మాట్లాడుతూ.. జేఎన్టీయూ(హెచ్) పరిధిలోని అన్ని కళాశాలల్లో ఒకే సిలబస్, ఒకే మూల్యాంకన విధానం అమలులో ఉందని, ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైస్‌చాన్సలర్ చొరవతో ఈ ఏడాది కళాశాలకు 400 కంప్యూటర్లు వచ్చాయన్నారు. విద్యార్థులు గ్రంథాలయం, ప్రయోగశాలలు, ప్లేస్‌మెంట్ శిక్షణ, ప్రాజెక్టు పనులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా, న్యాక్‌గుర్తింపు, ఏ బీఏ అక్రిడిటేషన్ సాధించడం గర్వకారణమన్నారు. మొబైల్ ఫోన్ల దుర్వినియోగానికి దూరంగా ఉండి సృజనాత్మకతను పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. సీఆర్‌సీ చైర్మన్ సురేష్ శ్రీపాద ఓరియంటేషన్ ఉద్దేశాన్ని వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


