జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు 22,222 క్యూసెక్కుల వరద వస్తోంది. నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకుగాను 34.577 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నుంచి 934 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
ఎమ్మార్పీకే ఎరువులు విక్రయించాలి
పెగడపల్లి: ఎమ్మార్పీ ధరలకే ఎరువులు విక్రయించాలని డీఏవో భాస్కర్ డీలర్లను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఏవో శ్రీకాంత్‌తో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిష్టర్లు, ధరల వివరాలను పరిశీలించారు. రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని సూ చించారు. పురుగుల మందులు, నకిలీ విత్తనా లు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకు ని పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, నువ్వులు వంటి సాగునీటి ఆధారిత ఆరుతడి పంటలు సాగు చేయడం ద్వారా తక్కువ నీటితో మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు.
శిలీంధ్రాలతో ఎండుతున్న మొక్కజొన్న
మెట్‌పల్లిరూరల్: భూమిలోని శిలీంధ్రాలతోనే మొక్కజొన్న పంట ఎండిపోతోందని కరీంనగర్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రాంప్రసాద్, రజనీకాంత్ అన్నారు. మెట్‌పల్లి మండలం వెల్లుల గ్రామంలో పలువురు రైతుల మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఆకులు ఎండిపోయి తెగుళ్ల బారిన పడినట్లు గుర్తించారు. భూమిలోని శీలింధ్రం కారణంగానే పంట ఎండిపోతోందని పేర్కొన్నారు. నివారణకు ప్రొపికొనోజోలు, వాలిడోమైసిన్ 2 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటిలో కలిపి మొక్క మొదలు తడిచేలా వేర్ల వద్ద పిచికారీ చేయాలని సూచించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏవో దీపిక, ఏఈవో మమత, రైతులు పాల్గొన్నారు.
నేడు జేఎన్టీయూలో ఓరియంటేషన్
కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ(నాచుపల్లి)లో బీటెక్ ఫస్టియర్ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహిస్తామని యాజమాన్యం తెలిపింది. ముఖ్య అతిథిగా జేఎన్టీయూ(హైదరాబాద్) ఉపకులపతి ప్రొఫెసర్ కిషన్ కుమార్‌రెడ్డి హాజరై ఉపాధి అవకాశాలు, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసంపై సూచనలు చేస్తారని పేర్కొంది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది పాల్గొనాలని కోరింది.
చిట్టాపూర్‌లో బోనాల సంబరాలు
మల్లాపూర్: మండలంలోని చిట్టాపూర్‌లో ప్రాథమిక పాఠశాలలో మంగళవారం బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు బోనాలతో సందడి చేశారు. పోతరాజు వేషధారణలో ఆకట్టుకున్నారు. హెచ్‌ఎం మోల్కియోరెడ్డి మాట్లాడుతూ.. బోనాల పండుగను పల్లెలు, పట్టణాల్లో వైభవంగా జరుపుకొంటున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు కుంట భూమేశ్వర్, బెజ్జారపు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


