● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాలరూరల్: వర్షాలకు ఇళ్లు కూలిపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన పస్తం రమేశ్, స్వప్న ఇల్లు ఇటీవల కూలిపోగా.. వారికి తక్షణ సహాయం కింద రూ.1.20 లక్షలు మంజూరు చేయిస్తానని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ రాధ, తహసీల్దార్ వహిద్, ఎంపీడీవో నీరజ, ఎంపీవో సలీం, సింగిల్ విండో చైర్మన్ మల్లారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
డబుల్‌బెడ్‌రూంల వద్ద వసతులు కల్పించాలి
జగిత్యాల: డబుల్‌బెడ్‌రూం ఇళ్ల వద్ద పూర్తిస్థాయి వసతులు కల్పించాలని ఎమ్మెల్యే అన్నారు. హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ రెండో విడత రెండువేల ఇళ్లు మంజూరయ్యాయని, రేకులషెడ్డు ఉన్న వారికి స్లాబుకు రూ.2లక్షల మంజూరుకు అవకాశం ఉందని, గుడిసెలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ కాలనీ వసతుల కల్పనకు రూ.20 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. కాలనీలో పాఠశాల, అర్బన్ హెల్త్ సెంటర్, మెయిన్‌రోడ్, కమ్యూనిటీ హాల్ స్థల సేకరణ చేయాలన్నారు. డీఈ సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రజా ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి
మెట్‌పల్లి: పజా ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్ మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలకు కేటాయించిన సిబ్బంది వద్ద ఆయా గ్రామాల పూర్తి సమాచారం అందుబాటులో ఉండాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ రాములు ఉన్నారు.


