జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలోని రైస్‌మిల్లులకు ప్రభుత్వం అప్పగించిన ధాన్యం మాయం కావడంపై రాష్ట్ర విజి లెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేస్తూ కొరడా ఝులిపిస్తున్నారు. మల్లాపూర్ మండలం మొగి లిపేట శివారులోని ఏఆర్‌ఎస్ మిల్లుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీ బసవరెడ్డి, డీఎస్పీ సీతారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు చేపట్టారు. సాయంత్రం వరకు కొనసాగిన ఈ తనిఖీల్లో రూ.45 కోట్ల విలువైన సుమారు 18,560 టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడుల్లో డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, తహసీల్దార్ రాంచంద్రం, ఎస్సై అనిల్ పాల్గొన్నారు.
రైస్‌మిల్లర్లలో ఆందోళన
గత బుధవారం జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి శివారులోని రైస్‌మిల్లుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టి రూ.87.89 కోట్ల ధాన్యం మాయమైనట్లు గుర్తించి మూడు రైస్‌మిల్లుల యజమానులు నలుగురిపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే మొగిలిపేట శివారులోని ఏఆర్‌ఎస్ రైస్‌మిల్లులో తనిఖీ చేసి సుమారు రూ.45 కోట్ల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. అధికారుల తనిఖీలతో ధాన్యం లేని రైస్‌మిల్లర్లు మిల్లులకు తాళాలు వేసుకుని ఫోన్లు స్విచ్ఛాఫ్ పెట్టుకుని రహస్య ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్లు సమాచారం. మరో రెండుమూడు రోజుల పాటు మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
రేపు సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ
మెట్‌పల్లి: బీసీలకు 50శాతం రిజర్వేషన్ల సాధనకు హైదరాబాద్‌లో ఈనెల 6న తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి చిట్నేని రఘు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సభకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పలువురు యువకులు ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. చెట్లపల్లి సుఖేందర్, లింగంపల్లి సంజీవ్, రేండ్ల రాజన్న, అజార్, ప్రశాంత్, ముఖీమ్ తదితరులున్నారు.


