● లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం ● భయంభయంగా ప్రజలు ● పొర్లుతున్న వాగులు, కుంటలు ● పలుచోట్ల నిలిచిపోయిన రాకపోకలు
జగిత్యాల: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రెండోరోజు కూడా భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. సదర్‌మాట్ బ్యారేజీకి సుమారు 10వేల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో మూడు గేట్లను ఎత్తి అదేస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ సదర్‌మట్ బ్యారేజీని పరిశీలించారు. జిల్లాకేంద్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జగిత్యాల చుట్టూ ఉన్న ఐదు చెరువుల నాలాలు పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో వరదనీరు ఇళ్లను ఆనుకుని ప్రవహిస్తోంది. మోతె వాగుకు వరద ఉధృతి పెరగడంతో వెంకటాద్రినగర్ బ్రిడ్జి మునిగిపోయింది. కండ్లపల్లి చెరువు సమీపంలో ఉన్న ప్రజల ఇళ్లలోకి నీరు చేరింది. వారిని మున్సిపల్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బైపాస్‌రోడ్ సమీపంలో మ్యాన్‌హోల్స్ ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాకేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను కూల్చివేస్తున్నారు.
మెట్‌పల్లిలో భారీ వర్షం
మెట్‌పల్లిరూరల్: బుధవారం రాత్రి నుంచి మోస్తరు వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గురువారం పొద్దంతా ముసురు పెట్టడంతో జనజీవనం స్తంభించింది. వెల్లుల, చెర్లకొండాపూర్‌లో రెండు పాత ఇళ్లు కూలిపోయాయి. వాటిని తహసీల్దార్ నీత, ఎంపీడీవో మహేందర్, ఆర్‌ఐ సంధ్యారాణి, సర్పంచ్ లాస్య పరిశీలించారు. అల్లూరి సీతరామరాజు తండా శివారు లోలెవల్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్సై కిరణ్‌కుమార్ నీటి ఉధృతిని పరిశీలించారు.
ఉధృతంగా గోదావరి, పెద్దవాగు
మల్లాపూర్: బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు మల్లాపూర్ మండలవ్యాప్తంగా 10.8 సెంటీమీటర్ల వర్షం కురిసిందని ఏఎస్‌వో శ్రీనివాస్ తెలిపారు. గోదావరి, పెద్దవాగు ఉధృతంగా ప్రవహించాయి. తహసీల్దార్ రాంచందర్, ఎస్సై అనిల్, ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు నీటి ప్రవహాన్ని పరిశీలించారు. మల్లాపూర్‌లో మోడల్ స్కూల్ రోడ్డు నీటమునగడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. స్కూల్ రోడ్డు నీటమునగడంతో బాలికల హాస్టల్ నైట్‌వాచ్‌మన్ సత్యనారాయణ నీటిలో చిక్కుకున్నారు. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి స్పందించి అతడిని క్షేమంగా రోడ్డు దాటించారు.
కల్లూర్ లోలెవల్ వంతెన పరిశీలన
కోరుట్లరూరల్: మండలంలోని కల్లూర్–సర్పరాజ్‌పూర్ మధ్య పెద్ద వాగుపై ఉన్న లోలెవల్ వంతెనను కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్‌తో పరిశీలించారు. వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హైలెవల్ వంతెనకు ప్రతిపాదనలు పంపించాలని ఆర్‌అండ్‌బీ ఏఈ లక్ష్మీకాంత్‌కు సూచించారు. ఆర్డీవో జీవాకర్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య, సీఐ లక్ష్మీనారాయణ, సర్పంచులు నత్తి రాజ్‌కుమార్, చిట్నేని లత ఉన్నారు.


