తుమ్మెనపల్లి – సాలపల్లి మధ్య తెగిపోయిన దారి
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది
పుష్కరఘాట్ల వద్ద భారీ బందోబస్తు
తుమ్మెనాల వద్ద తెగిపోయిన రహదారి
ధర్మపురి పుష్కరఘాట్ల సమీపంలో గోదావరి ఉధృతి
ధర్మపురి: ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. ఆకసాయిపల్లె సమీపంలో జాతీయ రహదారిపై లోలెవల్ వంతెన నీటమునిగింది. తుమ్మెనాల నుంచి సాలపల్లె మీదుగా ధర్మపురికి వచ్చే రహదారి తెగిపోయింది. పట్టణంలోని పలు వార్డుల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కరఘాట్ల సమీపంలోకి ప్రవాహం చేరుకుంది.
ప్రమాదపుటంచున స్తంభంపల్లి పెద్దచెరువు
వెల్గటూర్: మండలంలోని స్తంభంపల్లి పెద్దచెరువు మత్తడి దూకుతోంది. గతేడాది బుంగ పడగా.. తాత్కాలిక చర్యలు చేపట్టారు. తాజాగా కట్టపై ఒత్తిడి పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్టకు ప్రమాదం జరిగితే వెంకటాపూర్, కుమ్మరిపల్లి, వెల్గటూర్, కోటిలింగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు.
ముత్యాల పోచమ్మ చుట్టూ డ్రైనేజీ నీరు
గొల్లపల్లి: మండలకేంద్రంలోని ముత్యాల పోచమ్మ ఆలయంతోపాటు శ్రీకాలభైరవ సహిత స్వయంభు అష్టభుజ దుర్గాదేవి ఆలయం చుట్టూ డ్రైనేజీ నీరు చేరింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో దర్శనానికి భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ నీటి కారణంగా దోమలు పెరిగి, టైపాయిడ్, మలేరియా వంటి వైరల్ ఫీవర్ వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిలిచిన రాకపోకలు
రాయికల్: మండలంలోని భూపతిపూర్, మైతాపూర్, కుమ్మరిపల్లిలోని లోలెవల్ వంతెనలపై ఉధృతంగా వర్షపునీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాయికల్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, ఎస్సై సుధీర్‌రావు, ఎంపీవో సుష్మ పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. మైతాపూర్ కల్వర్టుపై పడిపోయిన చెట్టును తహసీల్దార్, ఎంపీడీవో స్వయంగా తొలగించారు.


