నిండు కుండలా 1,226 చెరువులు, కుంటలు
వానాకాలం పంటలకు ఊపిరి
జగిత్యాలఅగ్రికల్చర్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. మొన్నటి వరకు ఎల్‌నినోతో దిగులు పడిన రైతులకు ప్రస్తుత వర్షంతో చెరువులు నిండడంతో పంటలపై ఆశలు చిగురిస్తున్నాయి. యాసంగి కూడా గట్టెక్కే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. జిల్లాలో నీటి పారుదల శాఖ కింద 1226 చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు ఉన్నాయి. వీటి కింద 81,322 ఎకరాల ఆయకట్టు ఉంది. 939 చెరువులు ఉండగా వాటి కింద 55,332 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 100ఎకరాలకు పైగా ఆయకట్టు చెరువులు 107 ఉన్నాయి. వంద ఎకరాల లోపు ఉన్న చెరువులు 832 ఉన్నాయి. ఈ చెరువులన్నీ వర్షాలు కురిసినప్పుడు.. లేకుంటే ఎస్సారెస్పీ నీటితో నింపాల్సిందే. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దాదాపు 90 శాతం చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. కొన్ని చెరువులు అలుగు పోస్తున్నాయి. ఆ నీరంతా వాగుల ద్వారా దిగువకు వెళ్తోంది. గుల్లపేట, తక్కళ్లపల్లి వంటి ప్రాంతాల్లో వాగులపై చెక్ డ్యాంలు నిర్మించినప్పటికీ పెద్దగా నీరు నిలిపే పరిస్థితి లేదు. పెంబట్ల వంటి చాలా చెరువుల్లో పూడిక పేరుకుపోవడంతో కొద్దిపాటి వర్షానికే నిండుతున్నాయి. కొన్ని చెరువులు ఆక్రమణలకు గురవడంతో నీటి సామర్థ్యం భారీగా తగ్గిపోతోంది.


