సామరస్యంగా పరిష్కరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సామరస్యంగా పరిష్కరించుకోవాలి

Mar 7 2026 7:30 AM | Updated on Mar 7 2026 7:30 AM

మెట్‌పల్లిరూరల్‌(కోరుట్ల): గ్రామాల మధ్య సరిహద్దు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తహసీల్దార్‌ నీత, సీఐ అనిల్‌ అన్నారు. ఈ నెల 5న ‘సాక్షి’లో ‘సరిహద్దు పంచాయితీలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శుక్రవారం మెట్‌పల్లి మండలం చెర్లకొండాపూర్‌, రాజేశ్వర్‌రావుపేట గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల ప్రజలతో చర్చించారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని, గ్రామంలో వీడీసీ ఆంక్షలు విధించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అది నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీడీవో సురేశ్‌, ఎస్సై నవీన్‌, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఐలు ఉమేశ్‌, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

‘భోగ శ్రావణి అవినీతిపరురాలు’

జగిత్యాలటౌన్‌: భోగ శ్రావణి పెద్ద అవినీతి పరురాలని, ఆమెను చూసి ఏం నేర్చుకోవాలో ఎంపీ అరవింద్‌ చెప్పాలని బీజేపీ బహిష్కృత నేతలు ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మాట్లాడారు. బల్దియా ఎన్నికల్లో అభ్యర్థుల డబ్బు రూ.60లక్షలు నొక్కేస్తే ఆమైపె ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కనీసం కమిటీ కూడా వేయలేదన్నారు. పార్టీని భ్రష్టు పట్టిస్తే సరిదిద్దాల్సిన పెద్దలే వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల పట్టణంలో పార్టీకి 20వేల ఓట్లు వస్తే మున్సిపల్‌ ఎన్నికల్లో 11వేలకు ఎందుకు పడిపోయిందో చెప్పాలన్నారు. కనీసం సొంత వార్డులో కూడా పార్టీని గెలిపించుకోలేని శ్రావణిని చూసి ఏం నేర్చుకోవాలో ఎంపీ చెప్పాలని ఎద్దేవా చేశారు. ఎంపీ అరవింద్‌ తమను కాల్చి పారేస్తామంటే తాము గాజులు తొడుక్కుని కూర్చుంటామా అని ప్రశ్నించారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా తుపాకులు పట్టుకుని పోరాటం చేసిన తాము అరవింద్‌ తాటాకు చప్పుళ్లకు భయపడమని స్పష్టం చేశారు. సమావేశంలో బహిష్కృత (సీనియర్‌) నాయకులు ఏసీఎస్‌ రాజు, సీపెల్లి రవీందర్‌, లింగంపేట శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ అరవ లక్ష్మి, ఆంకారి సుధాకర్‌, ప్రమోద్‌గౌడ్‌, బిట్టు తదితరులు పాల్గొన్నారు.

ఆధునిక సాగుపై అవగాహన

జగిత్యాలఅగ్రికల్చర్‌: జగిత్యాల రూరల్‌ మండలం చల్‌గల్‌ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో శుక్రవారం రైతులు, శాస్త్రవేత్తల చర్చావేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల నిర్వహణ, తెగుళ్లపై అవగాహన కల్పించారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న బీపీటీ–5204, జై శ్రీరామ్‌, జేజీఎల్‌–1798, కేఎన్‌ఎం–1638, హెచ్‌ఎంటీ సోనా, ఆర్‌ఎన్‌ఆర్‌–15048 వంటి సన్న రకాలను సాగు చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్‌ సూచించారు. ఆత్మ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సీడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ తనిఖీ

జిల్లా కేంద్రంలోని హస్నాబాద్‌లో గల శైల సీడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను శుక్రవారం డీఏవో భాస్కర్‌ తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిస్టర్‌ సక్రమంగా నిర్వహించడం లేదని తేలడంతో అమ్మకాలు నిలిపివేయాలని సంస్థ యజమానికి అదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించకుండా విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. మండల వ్యవసాయాధి కారులు తిరుపతినాయక్‌, వినీల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement