ప్రజావాణికి సమస్యల వెల్లువ
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 55 మంది అర్జీలు సమర్పించగా.. వాటిని పరిశీలించిన కలెక్టర్ వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్.లత, రాజాగౌడ్, జగిత్యాల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మాది పెగడపల్లి మండలం నందగిరి. గ్రామ పరిధిలో 52 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 63, 67, 458, 237, 173/1, 442/2434, 226, 163, 160 సర్వేనంబర్లలో ఉన్న 52ఎకరాల భూమిని నిరుపేద దళితులమైన మాకు కేటాయించండి.
– నందగిరి దళితులు, పెగడపల్లి మండలం
జిల్లాకేంద్రం శివారు సర్వేనంబర్ 138/ఆలోని 13.19 ఎకరాల ప్రభుత్వభూమి అన్యాక్రాంతం అవుతోంది. వివాదాస్పదంగా మారిన ఆ భూమిపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కమిటీ నియమించి నెల రోజులైనా చర్యలు తీసుకోలేదు. సదరు కమిటీ విచారణ నివేదిక సర్టిఫైడ్ కాపీ కోసం సహ చట్టం కింద దరఖాస్తు చేసినా సమాచారం ఇవ్వడంలేదు.
– పిల్లి బాలకృష్ణ, జగిత్యాల
మాది మెట్‌పల్లి మండలం ఆత్మకూరు. మా గ్రామం మధ్య నుంచే పెద్దవాగు ప్రవహిస్తుంది. వాగులో నీరుంటేనే తాగు, సాగునీటి అవసరాలు తీరుతాయి. ఈ వాగులో ప్రభుత్వం ఇసుక రీచ్ గుర్తించడంతో భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదముంది. ఇసుక రీచ్ రద్దు చేయాలని తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చాం. – ఆత్మకూరు వీడీసీ సభ్యులు
జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్ వెలుపల, రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లు, డివైడర్లతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. అసలే ఇరుకుగా ఉన్న ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లు, డివైడర్లతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ వెళ్లే బస్ ప్లాట్‌ఫాం వైపు బైక్ పార్కింగ్, కార్గో సర్వీసులు పెడుతున్నారు. రద్దీ తక్కువగా ఉండే ప్లాట్‌ఫాంవైపు కార్గో, బైక్ పార్కింగ్‌ను మార్చండి.
– ముజాహిద్, వ్యాపారి జగిత్యాల
జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ పరిధిలోని సర్వేనంబర్ 437లో గల గుట్టపై అక్రమ తవ్వకాలను నిలువరించేందుకు చర్యలు తీసుకుని ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడండి. పశుపక్ష్యాదులకు, ప్రకృతి రమణీయతకు నెలవుగా ఉన్న గుట్ట అక్రమ మైనింగ్‌పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు.
– నర్సింగాపూర్ సర్పంచ్, వార్డు సభ్యులు
మాది ధర్మపురి మండలం దొంతాపూర్. ఎస్సీ నేతకాని కులానికి చెందిన నేను బీర్‌పూర్ మండలం కోమన్‌పల్లి ఎస్టీ నాయకపు కులానికి చెందిన బర్ది పవన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న. 15రోజులకు నాభర్త కులస్తులు మమ్మల్ని కుల బహిష్కరణ చేశారు. కోమన్‌పల్లిలో ఉండొద్దంటూ ఎలాంటి శుభకార్యాలకు పిలవకుండా అవమానిస్తున్నారు. బహిష్కరణ చేసి వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోండి.
– పసుల సంగీత, దొంతాపూర్
ప్రమాదాలు నివారించండి
జిల్లాకేంద్రంలోని కరీంనగర్‌రోడ్డులోగల జయశంకర్ కూడలి వద్ద ట్రాఫిక్‌తో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. విద్యుత్ భవన్, ఐఎంఏ భవన్, నర్సింగ్ కళాశాల, రిజిస్ట్రేషన్ కార్యాలయం, కోదండ రామాలయం, గణేశ్ ఆలయాలతో రద్దీగా మారిన కరీంనగర్ రోడ్డులోని జయశంకర్ విగ్రహం వద్ద ట్రాఫిక్ పెరిగి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కూడలిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలి. – నాగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, న్యాయవాది
ప్రజావాణికి సమస్యల వెల్లువ
ప్రజావాణికి సమస్యల వెల్లువ
ప్రజావాణికి సమస్యల వెల్లువ
ప్రజావాణికి సమస్యల వెల్లువ
ప్రజావాణికి సమస్యల వెల్లువ
ప్రజావాణికి సమస్యల వెల్లువ
ప్రజావాణికి సమస్యల వెల్లువ


