వారసత్వం వదిలేశారు
కోరుట్ల: వారసత్వ సంపదను కాపాడాల్సిన హెరిటేజ్ డిపార్ట్‌మెంట్ కోరుట్ల కోట బురుజుల వెంట రెవెన్యూ రికార్డుల్లో ఆబాదీగా ఉన్న స్థలం చేజార్చుకున్న వైనం చర్చనీయంగా మారింది. కోరుట్లలో జైన చాళుక్యుల కాలం నుంచి ఉన్న కోట బురుజులు, కోనేరు వంటి వారసత్వ సంపదను ఆనుకుని సుమారు 3.02 ఎకరాల స్థలం ఉంది. ఆరు నెలల క్రితం వరకు పురాతన కట్టడాలను ఆనుకుని ఉన్న స్థలం పురాతత్వ, వారసత్వ, సాంస్కృతికశాఖకు చెందిది కావడంతో ఈ ప్రాంతంతో పాటు ఆనుకుని ఉన్న 200 మీటర్ల లోపు నిర్మాణాలకు మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ దసరాకు మహిషాసుర మర్ధనం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. హెరిటేజ్‌శాఖ వారు 2025 జులైలో కొత్త ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది.
వారసత్వం వదిలేశారు
జైన చాళుక్యుల కాలం నాటి కోట బురుజులు, కోనేరు కాలక్రమేణా దేశ్‌ముఖ్‌లు, జమీందార్‌ల స్వాధీనంలోకి వచ్చాయి. రెవెన్యూ రికార్డుల్లో ఆబాదీగా ఉన్న కోట బురుజులను ఆనుకుని ఉన్నస్థలం కొన్నేళ్లపాటు వారసత్వంగా కొందరి ఆధీనంలో ఉంది. అనంతరం కోట బురుజులతో పాటు పక్కనే ఉన్న స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని పురాతత్వశాఖ నిర్దేశించింది. కోరుట్ల కోట బురుజుల పక్కన ఉన్న 3.02 ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకునేందుకు కొందరు యత్నించగా స్థాని కంగా వివాదాలు నెలకొన్నాయి. 2007లో సాయిని రవీందర్ అనే వ్యక్తి కోట బురుజులను, కోనేరును ఆనుకుని ఉన్న 3.02 ఎకరాల స్థలాన్ని పరిరక్షించాలని కోరుతూ రిట్ పిటిషన్ నంబరు 27884 ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పూర్తి వివరాలు అందించాలని పురాతత్వశాఖను కోరింది. అనంతరం పరిశీలించిన హైకోర్టు 2010లో సా యిని రవీందర్ వేసిన కేసును కొట్టేసింది. అనంతరం అనుభవదారులు పురాతత్వశాఖ నివేదికలో కోట బురుజులు, కోనేరులు మాత్రమే చారిత్రక వారసత్వ ప్రాధాన్యత కింద వస్తాయని మిగిలిన స్థలానికి ఎలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న విషయాన్ని వెల్లడించకపోవడాన్ని తప్పు పడుతూ ఈ స్థలం తమకు చెందుతుందని 2013లో మళ్లీ హై కో ర్టును ఆశ్రయించారు. రెండు నెలల్లో ఈ సమస్యను తేల్చాలని హైకోర్టు ఆదేశించింది. పురాతత్వశాఖ కోట బురుజులు, కోనేరులకు మాత్రమే చా రిత్రక ప్రాధాన్యత ఉందని వీటిని పరిరక్షించడానికి వాటి చుట్టూ 10 నుంచి 15 ఫీట్ల స్థలాన్ని ఇవ్వాలని ఆనుభవదారులను కోరడంతో వారు అంగీకరించారని తెలుపుతూ కోర్టుకు నివేదిక ఇచ్చింది. దీంతో కోట బురుజులను ఆనుకుని ఉన్న 3.02 ఎకరాల స్థలం పురాతత్వ, వారసత్వశాఖ నుంచి చేజారింది.
అమ్మకానికి యత్నాలతో వివాదం
చారిత్రక కట్టడాలు మినహా మిగిలిన 3.02ఎకరాల్లో తమకు సంబంధం లేదని పురాతత్వశాఖ కోర్టుకు నివేదించిన క్రమంలో అనుభవదారులు సదరు స్థలాన్ని రిజిస్ట్రేషన్లు చేయించేందుకు సన్నాహాలు మొదలెట్టారు.ఆ స్థలం పక్కన తమకు ఉన్న ఇండ్ల నంబర్లు వాడుకుని పక్కన ఉన్న స్థలానికి ము న్సిపల్ అధికారుల నుంచి వేకెంట్ ల్యాండ్ టాక్స్ వేయించుకుని బిల్లు చెల్లించారు. ఎకరాల స్థలానికి వేకెంట్ ల్యాండ్ టాక్స్ వేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై అభ్యంతరాలు తెలుపుతూ కొందరు ఉన్నతాఽధికారులకు ఫిర్యాదు చేశారు. కోరుట్ల భూపరిరక్షణ కమిటీ ప్రతినిధులు సైతం సదరు స్థలాన్ని రిజిస్ట్రేషన్లు చేయద్దని కోరుట్ల సబ్ రిజిస్ట్రార్‌కు వినతి పత్రం ఇచ్చారు. మొత్తం మీద సుమారు 50 ఏళ్ల నుంచి కోరుట్ల వారసత్వ సంపదగా ఉన్న స్థలం ప్రభుత్వ శాఖల నిర్లిప్త ధోరణితో చేజారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


