ఐదు బల్దియాల నుంచి 229 అభ్యంతరాలు
జగిత్యాలజోన్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ప్రచురించిన ఓటర్ల జాబితాపై 229 అభ్యంతరాలు వచ్చాయని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం మున్సిపల్ ఎన్నికలపై సమీక్షించారు. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులు నిర్లక్ష్యం వహించకుండా సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్
మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వార్డులు, పోలింగ్‌స్టేషన్ల వారీగా ఓటర్ జాబితా తయారీపై సూచనలు చేశారు. పారదర్శకత పాటించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు. కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


