గజగజ.. స్వెట్టర్లు లేక విలవిల
రాయికల్: రాయికల్ బల్దియాలో పారిశుధ్య కార్మికులు చలికి గజగజ వణుకుతున్నారు. చలి నుంచి ఉపశమనం కోసం ధరించే స్వెట్టర్లు లేకున్నా.. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఉదయం 4.30గంటల నుంచే విధులకు బయల్దేరుతున్నారు. బల్దియాలోని పట్టణవాసుల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నారు. పట్టణ రోడ్లన్నీ శుభ్రం చేస్తున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు పారిశుధ్య కార్మికులకు బల్దియా తరఫున ఇప్పటివరకు స్వెట్టర్లుగానీ.. సామగ్రిగానీ సమకూర్చలేదు.
ఉదయం 4.30గంటల నుంచే
మున్సిపాలిటీలో 23 మంది పారిశుధ్య కార్మికులున్నారు. వీరిలో 12 మంది మహిళలు. పారిశుధ్య కార్మికులకు మున్సిపల్ కార్యాలయం నుంచి మూడేళ్లుగా కాస్మోటిక్ వస్తువులు అందించలేదు. ఫలితంగా కార్మికుల భద్రత గాలిలో దీపంలా మారింది. నిత్యం వేకువజామున మున్సిపల్ సిబ్బంది పారిశుధ్య కార్మికులు విధులకు హాజరవుతున్నారా..? లేదా..? అని పరిశీలన చేస్తున్నప్పటికీ వారి భద్రతను మాత్రం మరిచిపోతున్నారు. వాస్తవానికి ప్రతి ఆర్నెళ్లకోసారి యూనిఫాం, రాత్రివేళలో మెరిసే జాకెట్లు, మూడునెలలకోసారి కొబ్బరినూనె, సబ్బులు, బూట్లు, మాస్క్‌లు, బెల్లం ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే పాలకమండలి ఆధ్వర్యంలో స్వెట్టర్లను శీతాకాలంలో మున్సిపల్ కార్మికులకు పంపిణీ చేస్తారు. కానీ రాయికల్ మున్సిపల్‌లో మాత్రం అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చలిలో గజగజ వణుకుతూ విధులు నిర్వహిస్తున్నారు. లయన్స్‌క్లబ్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు స్పందించి బల్దియా పారిశుధ్య కార్మికులకు స్వెట్టర్లు అందించాలని కోరుతున్నారు.
చలిలోనే పారిశుధ్య పనులు
తెల్లారక ముందు నుంచే విధుల్లోకి
పట్టణం ఎప్పటికప్పుడు శుభ్రం
అయినా సామగ్రి అందించని అధికారులు


