నిర్లక్ష్యంతోనే ప్రాణాలు పోతున్నయ్
జగిత్యాలజోన్: వాహనదారుల నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి అన్నారు. జిల్లాకోర్టు ఆవరణలో రోడ్డు ప్రమాదాల అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం సంతకాల సేకరణ చేపట్టారు. జడ్జి మాట్లాడుతూ యువత రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతుండటంతో కన్నవారు జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. తీవ్రంగా గాయపడి జీవచ్ఛవంలా మారితే పరిస్థితి ఘోరంగా ఉంటుందన్నారు. ట్రాఫిక్‌రూల్స్‌పై అవగాహన లేక డ్రైవింగ్ చేస్తుండటంతో ఇతరులు భయపడే పరిస్థితి దాపురించిందన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ మాట్లాడుతూ మద్యం, నిద్ర మత్తు, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. సబ్ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కె.వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలతో ఇంటికొచ్చే వరకు కుటుంబమంతా ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం జడ్జిలు, న్యాయవాదులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్‌లు శ్రీనిజ కోహిర్కర్, నిఖిషా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరామలు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, జ్యూడిషియల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
అనంతరం జిల్లాకోర్టులో నిర్మిస్తున్న జెండా గద్దె, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేయాలని న్యాయమూర్తి అధికారులను అదేశించారు. కోర్టు పరిసరాలను చదును చేయించాలన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి


