అడ్డులేని ఇసుక
మెట్‌పల్లి మండలం రామలచ్చక్కపేటలో ఇసుక తవ్వకాలు నిత్యం వందలాది ట్రాక్టర్లలో తరలిస్తున్న మాఫియా కఠినంగా వ్యవహరించాలంటున్న అధికారులు పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది
అక్రమ రవాణా
మెట్‌పల్లిరూరల్: ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వాగుల్లో తవ్వకాలు చేపడుతున్న ఇసుకాసురులు ట్రాక్టర్లలో గ్రామాలు, పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మెట్‌పల్లి మండలం రామలచ్చక్కపేటలో కొద్దిరోజుల క్రితం ఇసుక తవ్వకాల కోసం వీడీసీ (విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ) వేలం వేసింది. అందులో రూ.లక్షలు పెట్టి ఇసుకను విక్రయించేందుకు అనుమతి దక్కించుకున్న కొందరు ఆ ప్రాంతంలోని ఒర్రె నుంచి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ దందాకు మాత్రం బ్రేక్ పడడంలేదు. ఇసుక రవాణా విషయంలో కఠినంగా వ్యవహరించాలని మెట్‌పల్లి తహసీల్దార్ నీత జీపీవోలకు కొన్నిరోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అక్రమణ రవాణాను సహించేదిలేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. అప్పుడు కఠినంగా వ్యవహరించిన జీపీవోలు ప్రస్తుతం మామూలుగా తీసుకుంటున్నారు.
ట్రాక్టర్ లోడ్‌కు రూ.1500
రామలచ్చక్కపేటలో ఒర్రె నుంచి ఇసుక తవ్వేందుకు ట్రాక్టర్ లోడ్‌కు రూ.1500 తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆ ఇసుకను మెట్‌పల్లితోపాటు ఇతర గ్రామాల్లో విక్రయించేందుకు వ్యాపారులు రూ.4 వేలకుపైనే తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసు క తరలిపోతున్నా.. వాటిని ఎవరూ అడ్డుకోవడంలే దు. రామలచ్చక్కపేట, జగ్గాసాగర్, వెల్లుల మీదుగా పట్టణానికి ట్రాక్టర్లలో ఇసుక వస్తోంది. అయినా ఆయా గ్రామాల జీపీవోలు ఇసుక రవాణాను ఎందుకు అడ్డుకోవడంలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా యి. మొదట్లో ట్రాక్టర్లను పట్టుకొని వాటిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి జరిమానాలు విధించేలా కఠినంగా వ్యవహరించారు. ఇప్పుడు వాటి వైపు దృష్టి పెట్టడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఇసుక అక్రమ రవాణా దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఈ విషయమై తహసీల్దార్ నీత మాట్లాడుతూ.. ఇసుక అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని తెలిపారు.
క్షేత్రస్థాయిలో
పరిస్థితులు భిన్నం
ఇసుక రవాణా విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యహరిస్తున్నట్లు పదేపదే చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. రెవెన్యూ విభాగంలోని కొందరు సిబ్బంది ఇసుక వ్యాపారులకు పరోక్షంగా సహకరించడంతోనే దందాకు అడ్డుపడడంలేదన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.


