కొండగట్టు గిరి ప్రదక్షిణ దారి పరిశీలన
మల్యాల: కొండగట్టు గిరి ప్రదక్షిణ దారిని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అటవీశాఖ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. గిరి ప్రదక్షిణ పొడవు ఆరు కిలోమీటర్లు ఉండగా.. 3కిలోమీటర్లు ఘాట్ రోడ్డు, మరో మూడు కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని 50 ఫీట్ల వెడల్పుతో 20 ఫీట్ల ఫుట్‌పాత్ నిర్మాణం కోసం అధ్యయనం చేశారు. భక్తుల సౌకర్యార్థం లైటింగ్, పార్కింగ్ ఏర్పాటు చేసేలా అంచనాలు రూపొందించారు. 1150 మీటర్ల మేర దారి అటవీశాఖ పరిధిలోకి వస్తుందని గుర్తించారు. గిరి ప్రదక్షిణకు అటవీశాఖ పూర్తిగా సహకరిస్తుందని, అటవీశాఖ భూమికి ప్రత్యామ్నాయంగా దేవాదాయ శాఖ భూమి బదిలి చేసే ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు. డీఎఫ్‌ఓ రవీందర్, అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ వసంత, ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డి, ఉప సర్పంచ్ కందిరి ముత్యంరెడ్డి, నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు గండి
జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం రేచపల్లి శివారులో డీ–53 12ఎల్ కాలువకు గండి పడింది. దిగువ రైతులకు నీరు అందడం లేదు. విషయాన్ని సారంగాపూర్, పోతారం రైతులు పెద్దిరెడ్డి మహేందర్‌రెడ్డి, నర్సింగంతోపాటు మరికొంత మంది రైతులు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎస్సారెస్పీ అధికారి చక్రనాయక్‌కు సమాచారం అందించారు. కాలువ గండిని పూడ్చి రైతులకు తక్షణమే నీరందించాలని కోరుతున్నారు.
చైనామాంజా విక్రయిస్తే చర్యలు:ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: నిషేధిత చైనామాంజాను విక్రయించినా.. వినియోగించినా చర్యలు తప్పవని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. చైనామాంజ విక్రయాలపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. నైలాన్, సింథటిక్ దారాలు పక్షులు, మనుషులు, పర్యావరణానికి హాని చేస్తాయన్నారు. మాంజా విక్రయిస్తే డయల్ 100కు కాల్‌చేసి సమాచారం అందించాలన్నారు.
ఈవీఎం గోదాంల వద్ద భద్రత
జగిత్యాలజోన్: ఈవీఎం గోదాంల వద్ద పటిష్టమైన భద్రత ఉంచడంతోపాటు అధికార యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్‌లోగల ఈవీఎం గోదాంను సోమవారం పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, ఇతర సాంకేతికమైన అంశాలను పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ బీఎస్.లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ తదితరులు ఉన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
జగిత్యాలక్రైం: రోడ్డు భద్రతపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ అన్నారు. సోమవారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట శివారులోని ఓ పాఠశాల విద్యార్థులకు రోడ్డు రవాణా భద్రతపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకూడదన్నారు. హెల్మెట్, సీటుబెల్టు ధరించేలా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. అనంతరం విద్యార్థులు అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు వెంకన్న, అభిలాష్, రియాజ్, కో–ఆర్డినేటర్ అనిల్, పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్‌రావు, హరిచరణ్‌రావు, మౌనికరావు పాల్గొన్నారు.
కొండగట్టు గిరి ప్రదక్షిణ దారి పరిశీలన
కొండగట్టు గిరి ప్రదక్షిణ దారి పరిశీలన


