తప్పు చేస్తే శిక్ష ఖాయం
తప్పు చేస్తే శిక్ష తప్పదు
నేర నిరూపణకు పోలీసుల కసరత్తు జిల్లాలో వరుసగా తీర్పుల వెల్లడి ఇటీవల ఒకే కేసులో ఆరుగురికి జీవిత ఖైదు నిత్యం సమన్వయం చేస్తున్న పోలీసులు
జగిత్యాలక్రైం: నేరాలు చేసిన వారు ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంతో తప్పించుకునే పరిస్థితి లేదు. చేసిన తప్పులను పోలీసులు రుజువు చేస్తుండటంతో న్యాయస్థానాల్లో శిక్షలు తప్పడం లేదు. నేరం చిన్నదైనా.. పెద్దదైనా శిక్ష అనుభవించాల్సిందే. నేరం చేసి ప్రపంచంలో ఎక్కడికెళ్లినా పోలీసులు పట్టుకొస్తున్నారు. ఇటీవల మల్యాల మండలం బల్వంతాపూర్ శివారు ఆశ్రమంలో పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన సంఘటనలో కోర్టు ఆరుగురికి జీవిత ఖైదు విధించింది.
సాంకేతికతతో విచారణ
గతంలో నేరం జరిగితే దానిని నేరుగా చూసిన వాళ్లు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉండేది. నేరం జరిగిన ప్రాంతంలో నిందితుడు ఉన్నాడా? లేదా? అనేది కూడా ఎవరైనా చూసి ఉండి.. కోర్టులో సాక్ష్యం చెప్పాలి. నేడు పరిస్థితి మారిపోయింది. నేరస్థలంలో సదరు వ్యక్తి ఉన్నాడా..? లేదా..? తెలుసుకునేందుకు నిందితుడు వాడే సెల్‌ఫోన్, సదరు ఏరియాలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీలు, ఫొరెన్సిక్ ల్యాబ్, డాగ్‌స్క్వాడ్ వంటి వాటిని వినియోగిస్తూ సరైన సాక్ష్యాలను సేకరించి చార్జిషీట్‌లో పొందుపరుస్తున్నారు. ఇవి కేసులకు బలం చేకూరుస్తూ.. నిందితులకు తగిన శిక్ష పడేలా చేస్తున్నాయి.
సమన్వయంతో సత్ఫలితాలు
నేరం జరిగిన వెంటనే ఎస్‌ఐఆర్ నమోదు, చార్జిషీట్ దాఖలు, పక్కాగా సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టి నేరాన్ని నిరూపిస్తే వంద శాతం శిక్ష పడడం ఖాయమని పోలీసులు చెబుతున్నారు. కేసుల నమోదు, విచారణలో నాణ్యత పాటించాలని, సాంకేతికతను వినియోగించాలని పోలీస్ ఉన్నతాధికారులు సమీక్ష సమావేశాల్లో దిశనిర్దేశం చేస్తూ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్నారు.
తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. చేసిన తప్పును పరిగణనలోకి తీసుకుని దానికి తగినట్లు న్యాయస్థానం శిక్ష వేస్తుంది. పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, కోర్టు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇటీవల వెలువడిన పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి.
– అశోక్‌కుమార్, ఎస్పీ
శిక్ష 2022 2023 2024 2025 జీవితకాలం 2 14 10 23
5నుంచి పదేళ్లు 2 2 11 26
3నుంచి ఐదేళ్లు 3 6 3 10
1నుంచి మూడేళ్లు 9 20 12 27
ఏడాది లోపు 44 13 26 29
మొత్తం 60 55 62 115


