
15 నెలలుగా అందని వేతనాలు
● ‘భూభారతి’ ఆపరేటర్లను పట్టని ప్రభుత్వం
పెగడపల్లి: తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న భూభారతి కంప్యూటర్ ఆపరేటర్లకు వేతన వెతలు తప్పడం లేదు. జిల్లాలో 21మంది కంప్యూటర్ ఆపరేటర్లు, ఒక కో–ఆర్డినేటర్ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి 15 నెలలుగా జీతాలు రాక ఆర్థికంగా ఇబ్బందిపడుతూ కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల భూభారతి చట్టంగా తీసుకొచ్చిన విషయం తెల్సిందే. సుమారు 15 నెలలుగా వేతనాలు రావడం లేదని వాపోతున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో తహసీల్దార్లకు సంయుక్త రిజిస్ట్రార్లుగా అదనపు బాధ్యతలు అప్పగించి వ్వయసాయ భూముల రిజిష్ట్రేన్ల విధులను కేటాయించింది. రిజిష్ట్రేషన్ల కోసం ఓ ప్రైవేటు సంస్థ ద్వారా 2018 మే 23న జిల్లాలో కో–ఆర్డినేటర్లతో పాటు 21 మంది ఆపరేటర్లను నియమించారు. వీరికి 2021 జూలై 15 వరకు రూ.9,878 చొప్పున వేతనం అందేది. తర్వా త రూ.11,970 చొప్పున చెల్లించారు. వేతనాలు చెల్లించాలని కలెక్టర్, మంత్రులు. సీఎం వరకు వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోవడంలేదని అంటున్నారు. చాలామంది ఆపరేటర్లు అప్పు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. భూభారతి చట్టంలోని అనేక అంశాలపై పూర్తి పట్టుండటంతో రెవెన్యూ పనుల్లో ఆపరేటర్ల సేవలు వినియోగించుకుంటున్నారు. చిల్లిగవ్వ జీతం లేకున్న శాశ్వత ఉద్యోగులతో సమానంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు.. అవసరమైతే ఆదివారాల్లో కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. పెండింగ్‌లో వేతనాలతోపాటు 2021 జూన్‌లో వచ్చిన జీవో 63 ప్రకారం రూ.31,040కు పెంచాలని, ప్రతినెలా ఐదో తేదీలోపు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.