
డెంగీ బెల్స్
జిల్లావ్యాప్తంగా విష జ్వరాల జోరు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న వైద్యాధికారులు నామమాత్రంగా దోమల నివారణ చర్యలు
కోరుట్ల: జిల్లాలో పలు చోట్ల డెంగీ డేంజర్ బెల్స్ మోగుతున్నా వైద్యాధికారులు మాత్రం ముందు జాగ్రత్త చర్యలపై నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వారం రోజుల పాటు వర్షాలు కురిసిన దరిమిలా దోమలు ఇబ్బడిముబ్బడిగా పె రిగిపోయాయి. దోమల నివారణకు మున్సిపల్ పంచాయతీ అధికారులు తూతూ మంత్రంగానే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా మలేరియా, డెంగీ జ్వరాలతో జనం నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్‌పేషేంట్ల సంఖ్యను పరిశీలించగా జ్వరాలు విజృంభిస్తున్నాయన్నది తేటతెల్లమవుతుంది.
పెరుగుతున్న ఔట్ పేషెంట్లు
వారం రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రులకు జ్వరాలతో వస్తున్న రోగుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం కలవరపెడుతోంది. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజూ ఔట్ పేషెంట్ల సంఖ్య 700–750 ఉండగా జ్వరాల విజృంభణ కారణంగా 850–900 వరకు చేరుకుంది. కోరుట్ల ప్రభుత్వాసుత్రిలో ఔట్ పేషెంట్ల సంఖ్య రోజు 250–300 వరకు ఉంటుండగా నాలుగైదు రోజులుగా 450 వరకు పెరిగింది. మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రిలో 300–350 లోపు ఉండే ఔట్ పేషెంట్ల సంఖ్య రెండు రోజులుగా 450కి చేరుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన రోగుల్లో ఎక్కువగా జ్వరాలతో వస్తున్న వారే కావడం గమనార్హం. మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలతో పాటు ప్లెట్‌లెట్లు తగ్గిన లక్షణాలతోనూ వస్తుండటంతో డెంగీగా అనుమానించాల్సి వస్తోంది. కోరుట్లలో మూడు రోజుల క్రితం పసలోటి వెంకటేశం డెంగీతోనే చనిపోవడం కలవరం రేపుతోంది.
దోమల నివారణ చర్యలేవి?
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలతో పాటు గ్రామపంచాయతీల్లోనూ దోమల నివారణకు పెద్దగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ప్రతీ ఏడాది వర్షాకాలం సీజన్‌కు ముందు డెంగీ దోమల నివారణకు ప్రతీ శుక్రవారం పాటించాల్సిన డ్రైడే కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. దీనికి తోడు మున్సిపాలిటీల్లో ఉన్న ఒకటి, రెండు ఫాగింగ్ మిషన్లను వాడుతున్న ఆనవాళ్లు లేవు. వర్షాలతో నీటితో నిండిన ఖాళీ స్థలాల్లో ఆయిల్ బాల్స్ వేయడం లేదు. కనీసం నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల లార్వాను తినే గంబూసియా చేపలను వదలడం లేదు. కేవలం అక్కడక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లి తమ పని ముగిసిందని చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా అఽధికారులు జ్వరాల విజృంభణ విషయంలో అప్రమత్తమం కాకుంటే రానున్న కాలంలో జనం మరింత సతమతమయ్యే పరిస్థితులు ఎదురుకావచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

డెంగీ బెల్స్