
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు
మల్యాల: మండలంలోని దిగువ కొండగట్టు వద్ద జగిత్యాల–కరీంనగర్ రహదారిపై మంగళవారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో రెండుకార్లలో ఉన్న నలుగురు గాయపడ్డారు. కొండగట్టుకు చెందిన రంగు నర్సింహులు, విజయ హైదరాబాద్ నుంచి కొండగట్టుకు వస్తున్నారు. జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ భర్త అడువాల లక్ష్మణ్ కరీంనగర్ వైపు వెళ్తున్నాడు. దిగువ కొండగట్టు వద్ద రెండు కార్లు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. కార్ల ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. కార్ల బెలూన్లు తెరుచుకోవడంతో నర్సింహులు, విజయ, అడువాల లక్ష్మణ్, మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. ట్రాఫిక్ అంతరాయం కలుగడంతో ఎస్సై నరేశ్‌కుమార్, కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. బాధితులను 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. నర్సింహులు అతివేగంగా, అజాగ్రత్తగా కారు నడిపి అడువాల లక్ష్మణ్ కారును ఢీకొన్నారని, లక్ష్మణ్ బావమరిది మిట్టపల్లి సాయిప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నరేశ్ కుమార్ తెలిపారు.