
రైతులకు ఆధునిక టెక్నాలజీ
బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవాలి
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులకు ఆధునాతన టెక్నాలజీని పరిచయం చేయడంతోపాటు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కేంద్ర ప్రభుత్వం నమోడ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మహిళాసంఘాలకు ఎరువులు, రసాయనాలు పిచికారీ చేసే డ్రోన్లను సబ్సిడీపై సరఫరా చేయనుంది. రానున్న రోజుల్లో కూలీల సమస్యతో వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకం పెరగనుండటంతో.. డ్రోన్లను అద్దెకిచ్చి మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మహిళాసంఘాల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. అర్హులైన సంఘాలను ఎంపిక చేయాలని బ్యాంకర్లకు ఆదేశాలు అందాయి.
వ్యవసాయంలో ఆధునికత కోసం
వ్యవసాయ రంగంలో పెరుగుతున్న సాగు ఖర్చులు, కూలీల సమస్యతో రైతులకు పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. ఇటీవల పంటలపై పురుగులు, తెగుళ్ల బెడద పెరుగుతుండటంతో ప్రతి రైతు క్రిమిసంహారక, రసాయన మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. అయితే మందులు పిచికారీ చేసేందుకు కూలీలు దొరికే పరిస్థితి లేదు. సన్న, చిన్నకారు రైతుల సంఖ్యే ఎక్కువగా ఉండటం.. ఆర్థిక సమస్యలతో ఆధునిక పరికరాల వాడకం పెద్ద సమస్యగా మారింది. లక్షలు విలువ చేసే పరికరాలను కొనుగోలు చేయలేని రైతులకు అండదండగా ఉండేందుకు మహిళా సంఘాలకు డ్రోన్లు అందించి వాటిద్వారా రైతులకు అద్దెకు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల రైతులు లబ్ధిపొందేలా.. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా నమో డ్రోన్ దీదీ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం కింద డ్రోన్‌లను సబ్సిడీపై కొనుగోలు చేసి అద్దెకిస్తే.. నెలకు మహిళా సంఘాల సభ్యులు రూ.లక్ష వరకు సంపాదించే వెసులుబాటు ఉంటుందని బ్యాంకర్లు చెపుతున్నారు.
డ్రోన్ కొనుగోలుకు రూ.8లక్షల సబ్సిడీ
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రూ.1,261 కోట్లతో 14,500 మహిళా సంఘాలకు ఆధునాతన డ్రోన్లను అందించనున్నారు. ఏ మహిళా గ్రూపు ముందుగా దరఖాస్తు చేసుకుంటుందో.. ఆ సంఘం ఎంపికయ్యే అవకాశం ఉంది. ఎంపిక చేసిన మహిళాసంఘాలకు డ్రోన్ పరికరాలను సబ్సిడీపై అందిస్తారు. డ్రోన్ ఖర్చులో గరిష్టంగా రూ.8లక్షల వరకు (80 శాతం) సబ్సిడీ ఇస్తారు. ఉదాహరణకు.. డ్రోన్ కొనుగోలుకు రూ.10 లక్షలైతే.. అందులో రూ.8లక్షల సబ్సిడీ ఇస్తారు. మరో రూ.రెండులక్షల వరకు బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయి. తీసుకున్న రుణానికి ఏడాదికి కేవలం 3శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడం.. పంట దిగుబడి పెంచడంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు విరివిగా వాడేలా చైతన్యం చేయాలని వ్యవసాయ శాఖ ద్వారా ప్రచారం చేస్తూనే.. డ్రోన్ల కొనుగోలుకు మహిళాసంఘాలు ముందుకొచ్చేలా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లోకి ఇంకా డ్రోన్లు పెద్దగా రాలేవని, ఇప్పుడే డ్రోన్లు కొనుగోలు చేసి పాగా వేస్తే.. మహిళల ఉపాధికి డోకా ఉండదని అధికారులు భావిస్తున్నారు.
డ్రోన్ టెక్నాలజీలో ప్రత్యేక శిక్షణ
మహిళాసంఘాల గ్రూపులకు డ్రోన్లను సబ్సిడీపై అందించడమే కాకుండా డ్రోన్ టెక్నాలజీ.. ఉపయోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ దాదాపు 15రోజులు ఉంటుంది. శిక్షణలో వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు పాలుపంచుకుంటారు. డ్రోన్లు ఆధునాతన జీపీఎస్, సెన్సార్ టెక్నాలజీతో రూపొందించబడి ఉంటాయి. ఏ మందును ఎంత ఎత్తులో పిచికారీ చేయాలనే దానిపై కూడా పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తారు. పురుగుమందులు పిచికారీ చేయడమే కాకుండా.. పొలంలో కలుపుమొక్కలు ఎక్కడున్నాయి..? నీరు ఎక్కడ లేదు..? వంటి వాటిపై కూడా డ్రోన్ శిక్షణలో మహిళలకు వివరిస్తారు. అలాగే మరమ్మతు, ఫిట్టింగ్ వంటి వాటి కోసం మరో సహాయకుడిని నియమించుకుంటే వారికీ శిక్షణ ఇస్తారు. ఈ పథకంలో డ్రోన్ డిమాండ్ అధికంగా ఉండే మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవచ్చు.
మహిళలకు ఆర్థిక స్వాలంబన
సబ్సిడీపై ‘నమో డ్రోన్ దీదీ’
జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు ఈ పథకం కింద ధరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 15వేల డ్రోన్లు ఇవ్వనున్నందున ఎవ్వరు ముందుగా దరఖాస్తు చేసే వారికి ఈ పథకం అందనుంది. అర్హత ఉండి, ఆసక్తి గల మహిళా సంఘాలు సమీపంలోని బ్యాంకులను సంప్రదించవచ్చు.
– రాంకుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్, జగిత్యాల

రైతులకు ఆధునిక టెక్నాలజీ