
కోడిగుడ్లకు టెండర్లు ఖరారు
జగిత్యాల: జిల్లాలోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అందించే కోడిగుడ్లకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. చైర్మన్, కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఇటీవల టెండర్లు ఓపెన్ చేశారు. మొన్నటివరకు ఎక్కడెక్కడి వారో గుడ్ల సరఫరా టెండర్లు దక్కించుకున్నారు. ఈసా రి జిల్లాకేంద్రంలోని కేఎల్ ఫౌల్ట్రీ వారు టెండర్ దక్కించుకున్నారు. ఒక్కోగుడ్డుకు రూ.6.14 చొ ప్పున వీరు మధ్యాహ్న భోజనానికి మినహాయించి అంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేయనున్నారు.
55 గ్రాములు తప్పనిసరి
టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కచ్చితంగా అంగన్‌వాడీకేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం.. తప్పకుండా 55 గ్రాముల బరువు ఉన్న గుడ్డును అందాల్సిందే. లేనిపక్షంలో వెనక్కి పంపించే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ ప్రతి ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా సరఫరా చేసినట్లు ధ్రువీకరణ తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిరోజుల్లోనే గుడ్ల సరఫరాను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నెలకు సుమారు 11లక్షల గుడ్లను సరఫరా చేయనున్నారు.
ఆన్‌లైన్‌లో టెండర్లు
గతంలో ఒక అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించి ఆన్‌లైన్‌లో టెండర్లు నిర్వహించేవారు. ఈసారి రెసిడెన్షియల్ పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లకు ఆన్‌లైన్‌లోనే టెండర్లు నిర్వహించారు. మొత్తం ముగ్గురు బిడ్డర్స్ బీడ్ చేయగా జగిత్యాలకు చెందిన వారు రూ.6.14కు కోట్ చేసి టెండర్ దక్కించుకున్నారు. టెండర్‌ను చైర్మన్, కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఓపెన్ చేశారు.
గతంలో ఆరోపణల వెల్లువ
గతంలో అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లినగుడ్లు, చిన్నసైజువి ఎక్కువగా సరఫరా అయ్యేవి. వాటినే అంగన్‌వాడీకేంద్రాల పిల్లలకు, గర్భిణులు, చిన్నారులకు అందించేవారు. గుడ్డు రేటు ఎక్కువగా పడుతోందని, కుళ్లిపోయిన, చిన్నసైజువి పంపిణీ చేస్తున్నారని అంగన్‌వాడీలు తీసుకునేవారు కాదు. తాజా నిబంధనల ప్రకారం.. 55 గ్రాములు ఉండే గుడ్లు పిల్లలకు అందనున్నాయి.
ప్రతి గుడ్డుపై స్టాంపింగ్..
విద్యాసంస్థలకు సరఫరా చేసే ప్రతి గుడ్డుపై ఈసారి ఒక ముద్ర పెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముద్రను ఇప్పటికీ నిర్ణయించలేదని, గుడ్డుపై స్టిక్కర్ వేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ గుడ్లు వేరేచోటకు సరఫరా చేస్తే కనిపెట్టవచ్చు. అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

కోడిగుడ్లకు టెండర్లు ఖరారు