మిల్లుల్లోనే దొడ్డుబియ్యం | - | Sakshi
Sakshi News home page

మిల్లుల్లోనే దొడ్డుబియ్యం

Mar 31 2025 8:27 AM | Updated on Mar 31 2025 8:27 AM

మిల్లుల్లోనే దొడ్డుబియ్యం

మిల్లుల్లోనే దొడ్డుబియ్యం

● మూలుగుతున్న 10వేల క్వింటాళ్లు ● రేషన్‌ కింద సన్నబియ్యం పంపిణీ షురూ

కోరుట్ల: రేషన్‌ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కావడంతో రైస్‌మిల్లుల్లో ఇప్పటికే నిల్వ ఉన్న దొడ్డు బియ్యం ఎవరికి అప్పగించాలన్న సమస్య తెరపైకి వచ్చింది. జిల్లాలోని బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల్లో ఇప్పటివరకు సుమారు 10వేలు క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సివిల్‌ సప్లై ఆఽధీనంలో ఉన్న సన్న బియ్యం మరో మూడు నెలల వరకు రేషన్‌ కింద సరఫరా చేసే వీలుందని తెలిసింది. మూడు నెలల తరువాత రేషన్‌ కింద సన్నబియ్యం పంపిణీకి సివిల్‌ సప్లై శాఖ మళ్లీ సన్నబియ్యం మాత్రమే సేకరణ చేసే అవకాశాలు ఉండగా.. మిల్లుల్లో ఉన్న దొడ్డు బియ్యం మొత్తం ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రైస్‌ మిల్లర్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

10 వేల క్వింటాళ్ల దొడ్డు బియ్యం

జిల్లాలో సుమారు 74 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మిల్లుల్లో 2022–23 నుంచి 2024–25 వరకు నాలుగు సీజన్ల ధాన్యం మిల్లింగ్‌ జరుగుతోంది. ఇప్పటివరకు ఈ ధాన్యం మిల్లింగ్‌ ఎంత వరకు జరిగిందో..? రైస్‌ మిల్లుల్లో ఇంకా ఎంత ధాన్యం నిల్వలు ఉన్నాయో..? లెక్క తేల్చలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కొత్తగా మరో నెల రోజుల్లో మళ్లీ రైస్‌ మిల్లులకు ధాన్యం అలాట్‌మెంట్‌ చేయనున్నారు. ఇదివరకే ధాన్యం మిల్లింగ్‌ చేయగా వచ్చిన దొడ్డు బియ్యం నిల్వలు అలాగే ఉండగా..మళ్లీ కొత్తగా వచ్చే ధాన్యం మిల్లింగ్‌ చేసి ఎక్కడ నిల్వ చేయాలన్న సమస్య తలెత్తింది. రైస్‌మిల్లుల నుంచి దొడ్డు బియ్యం తీసుకెళ్లడంలో సివిల్‌ సప్లై, ఎఫ్‌సీఐ అధికారులు జాప్యం చేస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే జిల్లాలోని అన్ని రైస్‌మిల్లులు కలుపుకొని సుమారు 10 వేల క్వింటాళ్లకు మించి దొడ్డు బియ్యం నిల్వలు మూలుగుతున్నట్లు సమాచారం. పదిహేను రోజుల క్రితం జిల్లాలోని సుమారు పదిహేను రైస్‌మిల్లుల నుంచి లారీల్లో దొడ్డు బియ్యం సివిల్‌ సప్లై గోదాం తీసుకెళ్లిన అనంతరం వాటిని అఽధికారులు తిప్పిపంపడం గమనార్హం. రేషన్‌ కింద సన్నబియ్యం సరాఫరా జూన్‌లో ఉంటుందని భావించినా ప్రభుత్వం ఉగాది నుంచి ప్రారంభించడంతోనే గోదాముల వరకు వెళ్లిన దొడ్డు బియ్యం వాపస్‌ వచ్చాయి.

దొడ్డు బియ్యంతో చిక్కులు..

ప్రతీ సీజన్‌లో రైస్‌ మిల్లుల్లో మిల్లింగ్‌ చేసిన దొడ్డు బియ్యాన్ని సివిల్‌ సప్లైతో పాటు ఎఫ్‌సీఐ అధికారులు సేకరిస్తారు. ఈ సారి మాత్రం సివిల్‌ సప్లై శాఖ రైస్‌ మిల్లుల నుంచి కేవలం సన్న బియ్యం సేకరించే అవకాశాలున్నాయి. మిల్లింగ్‌ చేసే మొత్తం దొడ్డు బియ్యాన్ని ఎఫ్‌సీఐ డిపార్ట్‌మెంట్‌ వారు తీసుకోవాల్సి ఉంటుంది. సివిల్‌ సప్లై అధికారులు దొడ్డు బియ్యం సేకరణ సందర్భంగా నాణ్యత విషయంలో ఇదివరకు కొంత వెసులుబాటు ఇచ్చేవారు. ఎఫ్‌సీఐ అధికారులు నల్లచుక్కలు (పిన్‌ పాయింట్‌ డామేజ్‌)ఉన్నా.. నూక శాతం 25కు మించి ఉన్నా.. కలర్‌ టెస్ట్‌లో ఆవకాడో గ్రీన్‌ రాకున్నా బియ్యం రిజెక్ట్‌ చేస్తారు. ఎఫ్‌సీఐ అధికారుల నిబంధనల ఫలితంగా రైస్‌ మిల్లర్లకు లెక్కలేని చిక్కులు రానున్నాయి. ఇతర జిల్లాలో కొన్ని రైస్‌ మిల్లుల నుంచి దొడ్డు బియ్యాన్ని పిలిప్పిన్స్‌ దేశం పంపేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగా.. ఇక్కడ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలూ రాలేవు. ఫలితంగా మిల్లుల్లో ఉన్న దొడ్డు బియ్యం అలాగే ఉండిపోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement