జిల్లాలో నేరాలు తగ్గుముఖం
సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నాం శాంతిభద్రతల పరిరక్షణకు కృషి రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చర్యలు ఎస్పీ అశోక్‌కుమార్ వెల్లడి
జగిత్యాలక్రైం: జిల్లాలో ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని, ఇందుకు పోలీస్‌శాఖ చేపట్టిన శాంతి భద్రతల రక్షణే కారణమని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. 2025లో నేరాలు, పోలీసుసేవలపై ఎస్పీ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. హత్యలు, దోపిడీలు, చైన్‌స్నాచింగ్, ఆన్‌లైన్ మోసాల్లో నిందితులను త్వరితగతిన గుర్తించామని, పెండింగ్ కేసుల పరిష్కారంలో పురోగతి సాధించామని తెలిపారు. షీ టీమ్స్, ఏహెచ్‌టీయూ, భరోసా కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామన్నారు. గతేడాది 5,919 నేరాలు నమోదు కాగా.. ఈ ఏడాది 5,620 నమోదయ్యాయని, ఈ లెక్కన 229 కేసులు తగ్గినట్లయ్యిందన్నారు. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో అత్యధికంగా 770 కేసులు, అత్యల్పంగా బుగ్గారం పోలీస్ స్టేషన్‌లో 135 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 29 హత్య కేసులు, 381 ప్రాపర్టీ కేసులు నమోదయ్యాయని, 187 కేసులను చేధించి రూ.22,92,37,439 రికవరీ చేశామన్నారు. 104 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదై గతేడాదితో పోలిస్తే 5 కేసులు తగ్గాయన్నారు. 19 కేసుల్లో 1,135.69 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇసుక అక్రమ రవాణాలో 234 కేసుల్లో 410 మంది నిందితులు, 260 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, గేమింగ్ యాక్ట్ కింద 167 కేసులు నమోదుకాగా.. నిందితుల నుంచి రూ.30,62,036 స్వాధీనం చేసుకున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 9,290 కేసులు నమోదయ్యాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు.
మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి
మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో 189 యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేశామన్నారు. 24.220 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 86 కేసులు నమోదు చేశామని, 203 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. 33మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశామన్నారు. డయల్ 100 కాల్ ద్వారా 30,954 కాల్స్ రాగా.. 130 కేసులు నమోదు చేశామన్నారు. గల్ఫ్ పంపిస్తామని చెప్పి మోసం చేసిన వాటిలో 44 కేసులు నమోదు చేసి 54 మందిని అరెస్ట్ చేశామన్నారు. అధిక వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఏడుగురిపై కేసు పెట్టామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై 21 కేసులు నమోదు చేశామని, 21 మంది నుంచి రూ.2,07,643 విలువైన 318.76 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
సంచలన కేసులు..
కోరుట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలిక హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించామని, 25 చోరీ కేసుల్లో నిందితుడిని పట్టుకుని రూ.25 లక్షల బంగారం స్వాధీనం చేసుకున్నామని, బర్ నేరాల్లో 1,351 ఫిర్యాదులు రాగా.. రూ.1.72 కోట్లు తిరిగి అందించామని పేర్కొన్నారు. 00 కేసులలో నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టామన్నారు. ఐదు విడతల లోక్‌అదాలత్ ద్వారా 9,595 కేసులు పరిష్కరించామన్నారు. కొండగట్టు ఆలయం పరిధిలో 383 సీసీ కెమెరాలను జిల్లా కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేశామని, గ్రీవెన్స్ డే ద్వారా 720 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారికి న్యాయం చేశామన్నారు. మై ఆటోఈజ్ సేఫ్‌లో భాగంగా జిల్లాలో 2,093 ఆటోలకు ఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీలు వెంకటరమణ, వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు ఆరీఫ్ అలీఖాన్, కరుణాకర్, రాంనర్సింహారెడ్డి, నీలం రవి, సుధాకర్, రఫీక్‌ఖాన్, ఆర్‌ఐలు వేణు, సైదులు పాల్గొన్నారు.


