జిల్లాలో జోరుగా హైటెక్‌ వ్యభిచారం ! యువకులకు నచ్చితే రేటు నిర్ణయం !! | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో జోరుగా హైటెక్‌ వ్యభిచారం ! యువకులకు నచ్చితే రేటు నిర్ణయం !!

Jul 19 2023 12:42 AM | Updated on Jul 27 2023 7:50 AM

- - Sakshi

జగిత్యాల క్రైం: జిల్లాలో హైటెక్‌ వ్యభిచారం జోరుగా సాగుతోంది. అందమైన యువతులు, మహిళల ఫొటోలను వాట్సాప్‌లో స్టేటస్‌గా పెడుతున్న దళారులు.. యువకులను ఆకర్షిస్తున్నారు. కేవలం తమకు పరిచయం ఉన్నవారితోనే వాట్సాప్‌ గ్రూపులు తయారు చేస్తూ వ్యభిచారం దందా విస్తరిస్తున్నారు. పట్టణ శివారు ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లను అడ్డాలుగా చేసుకుంటున్నారు.

జిల్లా కేంద్రంతోపాటు, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి, మల్యాల, కొండగట్టు తదితర ప్రాంతాల్లో దందా జోరుగా సాగుతోందనే సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు ఏడుగురు నిర్వాహకులపై మూడు కేసులు నమోదు చేశారు. అయినా, వ్యభిచారం ఆగడంలేదు.

ప్రముఖులకూ సరఫరా..

► దళారులు అందమైన యువతులను ఎరగా చూపుతూ యువకులను ఆకర్షిస్తున్నారు. కొందరు ప్రముఖులకు కూడా సరఫరా చేస్తున్నారు. ఇలాంటివారు కోరుకుంటే ఫామ్‌హౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు, అత్యాధునిక వసతులు కలిగిన భవనాలు ఎంచుకుంటున్నారు. ఖరీదైన వాహనాల్లో యువతలను తరలిస్తున్నారు. యువతులు అడిగినంత సొమ్ము చెల్లిస్తూ వ్యాపారం విస్తరిస్తున్నారు.

నెల టర్నోవర్‌ రూ.20లక్షల పైనే..

జిల్లాలో జరిగే హైటెక్‌ వ్యభిచారంలో సుమారు 150మంది దళారులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వీరు నిజామాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, వైజాగ్‌, వరంగల్‌, హైదరాబాద్‌, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లోంచి యువతులను రప్పిస్తున్నారు. తమతో టచ్‌లో ఉండే యువకులకు వీరి ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‌లో పెడుతూ, వాట్సాప్‌లో పంపిస్తూ ఆకర్షిస్తున్నారు. యువకులకు నచ్చితే.. ఆ ఫొటోలోని యువతికి రేటు నిర్ణయిస్తున్నారు.

ఇళ్లలో అయితే రూ.1,500 నుంచి రూ.2,000 వరకు, బయటకు తీసుకెళ్తే రూ.5వేల నుంచి రూ.6వేల వరకు రేట్‌ కుదుర్చుకుంటున్నారు. ఈ సొమ్మును ఫోన్‌పే, గూగుల్‌పే తదితర డిజిటల్‌ పద్ధతుల్లో చెల్లింపులు చేసుకుంటున్నారు. మరోవైపు.. జిల్లాలో సుమారు వంద మంది వరకు వ్యభిచార నిర్వాహకులు ఉన్నట్లు తెలిసింది. వీరితోనే దళారులు దందా సాగిస్తున్నారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా ప్రతినెలా సుమారు రూ.20లక్షల వరకు టర్నోవర్‌ సాగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నిఘా పటిష్టం చేశాం

► జిల్లాలో వ్యభిచారాన్ని అరికట్టేందుకు నిఘా పటిష్టం చేశాం. దందా ప్రాంతాల్లో పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇళ్లలో దాడులు చేస్తున్నారు. ఇప్పటివరకు నిర్వాహకులను అరెస్టు చేశాం. ఇంకా చాలామంది ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. వారిని కూడా పట్టుకుంటాం. – భాస్కర్‌, ఎస్పీ

► జగిత్యాల శివారు అంతర్గాం రోడ్డులోని ఓ ఇంటిపై పోలీసులు సోమవారం మధ్యాహ్నం దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ, నిర్వాహకులతోపాటు ముగ్గురు యువతులను పట్టుకున్నారు. యువతులను సఖీ కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు, విటుడిని రిమాండ్‌కు తరలించారు.

► జగిత్యాల శివారు తిమ్మాపూర్‌ రోడ్డులో కొత్త ఇంటిని అద్దెకు తీసుకున్న ఓ మహిళ కరీంనగర్‌, మంచిర్యాల ప్రాంతాలకు చెందిన ఇద్దరుయువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. నిందితులను పట్టుకుని కేసు నమోదు చేశారు. ఐదు నెలల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది.

► మల్యాల మండలం నూకపల్లి అర్బన్‌ హౌసింగ్‌ కాలనీలోని ఓ ఆలయం సమీపంలోగల ఇంట్లో కొద్దిరోజులుగా వ్యభిచారం జరుగుతోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు దాడి చేయగా అప్పటికే నిందితులు తప్పించుకుని పారిపోయారు.

► నెల క్రితం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉండేచోట ఓ మహిళ, ఇద్దరు యువతులు వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement