ధర్మపురిని ఏం అభివృద్ధి చేశావ్..?
బీఆర్‌ఎస్ హయాంలో చేసిన పనులే కనిపిస్తున్నాయ్ కొత్తగా కాంగ్రెస్ చేసిందేమిటో చెప్పాలి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల: అధికారంలోకొచ్చి రెండేళ్లవుతున్నా ఏం అభివృద్ధి చేశావో చెప్పాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను ప్రశ్నించారు. ఇప్పటికీ బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని తెలిపారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో ధర్మపురి ఒకటని, మంత్రిగా ఇప్పటివరకు ఏం చేశాడో అడ్లూరి చెప్పాలన్నారు. డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్, రెవెన్యూ డివిజన్, ఐటీఐ కళాశాల ఏర్పాట హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో రెండు గురుకులాలు, మాతాశిశు సంక్షేమ కేంద్రం, డయాలసిస్‌సెంటర్, రోడ్ల నిర్మాణం, మురికినీరు గోదావరిలో కలవకుండా చర్యలు తీసుకున్నామన్నారు. లక్ష్మణ్‌కుమార్ మాత్రం ఎక్కడా తట్టెడు మట్టి తీయలేదని ఎద్దేవా చేశారు. వికలాంగులు ఉపకరణల కోసం ఎదురుచూస్తున్నారని, బడ్జెట్‌లో ఎన్ని నిధులు పెట్టావో చెప్పాలన్నారు. ధర్మారం, నందిమేడారం రిజర్వాయర్ నీళ్లు సిద్దిపేట, సిరిసిల్లకు పోతున్నాయని అంటున్నాడని, ఆ ప్రాజెక్ట్‌లపై మంత్రికి అవగాహన ఉందా అని ప్రశ్నించారు. నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి..? ఏయే జిల్లాలకు వెళ్తాయి..? జిల్లాలవారీగా నీటి వాటా ఎంత ఉంటుందో ముందుగా తెలుసుకోవాలన్నారు. లక్ష్మణ్‌కుమార్ తన ఆస్తులపై మాట్లాడుతున్నారని, అది ప్రజలందరికీ తెలుసునన్నారు. 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ పారదర్శకంగా, బాధ్యతతో పనిచేశానన్నారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, మాజీమంత్రి రాజేశంగౌడ్ పాల్గొన్నారు.


