సమర్థవంతంగా పనిచేయండి
జగిత్యాలక్రైం: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అశోక్‌కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. ఓటర్లు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు పోలీస్‌శాఖ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లాకేంద్రంలో మంగళవారం బ్రీఫింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులు, సిబ్బంది చేయాల్సినవి, చేయకూడని పనులపై వివరించారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల పరిధిలోని మొత్తం 136 వార్డులకు 379 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, మొత్తంగా 900 మంది పోలీస్ సిబ్బందిని నియమించామని తెలిపారు. పోలింగ్ సామగ్రి, సిబ్బందిని ఎస్కార్ట్ మధ్య 45 రూట్లలో తరలించామన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా నలుగురు డీఎస్పీలు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 11 మంది సీఐలు, స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, ఎస్సైల ఆధ్వర్యంలో పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చేవారికి సెల్‌ఫోన్లు, మందుగుండు సామగ్రి, ఇంక్‌బాటిళ్లు, వాటర్ బాటిళ్లు వంటి వాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని సూచించారు. పోలింగ్ బూత్‌లో సెల్ఫీలు దిగడంపై నిషేధమని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్పీ రఘుచందర్, సీఐలు కరుణాకర్, సుధాకర్, రవి, రాంనరసింహారెడ్డి, ఆర్‌ఐ వేణు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సమర్థవంతంగా పనిచేయండి


